బ్రేకింగ్ : శివశంకర్ మాస్టర్ కన్నుమూత

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా తో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ సతీమణి, పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన కుమారుడు ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవలె ఆయన పరిస్థితి తెలుసుకొని నటుడు సోనూసూద్‌, ధనుష్, మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సహాయం అందించారు. 10 భాషలకు పైగానే కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో పలు చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకుపైగానే డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. పలుభాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు.తెలుగులో ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రానికి గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు. శివ శంకర్ మాస్టర్ మృతిపై సినీ ఇండస్ట్రీ కన్నీటి వీడ్కోలు తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.