చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో గ్రహణం కనిపించదు అంటున్నారు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కనుక.. గ్రహణం విడిచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవి ఏంటంటే… మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి చంద్రగ్రహణం. అదే రోజున అనగా.. మే 5న బుద్ధ పూర్ణిమ కూడా. దాంతో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణానికి చాలా విశిష్టత ఉంది అంటున్నారు పండితులు. ఆ సంగతి అలా ఉంచితే.. మన దగ్గర గ్రహణం అంటే అశుభంగానే భావిస్తారు. గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు నుంచే అశుభ గడియలు పాటిస్తారు. గ్రహణం సమయంలో భోజనం చేయడం, నిద్ర పోవడం వంటి పనులు చేయరు. ఆలయాలు కూడా మూసి వేస్తారు. ఇంట్లోని నీరు, ఆహార పదార్థాలన్నింటిలో గరిక పోచలు వేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని.. దేవుడికి పూజ చేసుకుని.. ఆ తర్వాత మళ్లీ ఆహారం వండుకుని తింటారు.

చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు ప్రారంభమయ్యి.. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు అంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. ఫలితంగా చెడు ఫలితాలు కలుగుతాయి అంటారు. గ్రహణం అనంతరం భూవాతావరణాన్ని శుద్ధి చేసేందుకు గాను కొన్ని పనులు తప్పకుండ చేయాలి అంటున్నారు పండితులు. ముఖ్యంగా ఓ ఐదు పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవెంటో ఇప్పుడు చూద్దాం.

గ్రహణం విడిచాక స్నానం చేయాలి:-

గ్రహణం సమయంలో చెడు కిరణాలు భూమి మీద ప్రసారం అవుతాయి అని చెప్పుకున్నాం కదా. వాటి ప్రభావం మన శరీరం మీద కూడా ఉంటుంది. అందుకే ఆ మలినాలను దూరం చేసుకోవడానికి గ్రహణం పూర్తవ్వగానే స్నానం చేయాలి. అర్థరాత్రి తర్వాత గ్రహణం విడిచినా సరే.. స్నానం చేయాలి. అది కూడా దుస్తుల మీదనే చేయాలి అంటున్నారు పండితులు.

ఇంటిని శుభ్రం చేయాలి:-

గ్రహణం ముగిసిన తర్వాత.. ఇంటిని శుభ్రపరుచుకోవాలి. గంగాజలాన్ని ఇంటి ప్రతి మూలలో చల్లి శుద్ధి చేసుకోవాలి. దేవుడి విగ్రహాలను తుడవాలి. పూజ తర్వాత భగవంతుడికి గంధంతో బొట్టు పెట్టాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల.. గ్రహణ కిరణాల చెడు ప్రభావం తొలగిపోతుంది.

రాత్రి మిగిలిన ఆహారాన్ని తినకూడదు:-

చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. మిగిలిన పదార్థాలను పశువులకు పెట్టవచ్చు. అలానే గ్రహణం ప్రారంభం కావడానికి ముందే పప్పులు, ఇతర పదార్థాల్లో గరిక పోచలు వేయాలి. నెయ్యి, పాలు లాంటి పదార్థాలపై తులసి దళాలను కప్పి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా వాటిని పడేయాల్సిన అవసరం ఉండదు. తులసి దళాలకు ప్రతి కూల, దుష్ప్రభావాలను గ్రహించే సామర్థ్యం ఉంటుంది అంటారు.

భగవంతుడికి అభిషేకం చేయాలి:-

గ్రహణం విడిచిన తర్వాత దేవాలయాన్ని శుభ్రం చేస్తారు. అలానే మన ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉంటే.. గంగాజలంతో అభిషేకం చేసి.. ఆ విగ్రహాలకు ఉన్న పాత దుస్తులను తీసేసి వేరే స్వచ్ఛమైన దుస్తులను ధరింపజేయాలి. అనంతరం భగవంతుడికి పూజ చేసి.. నైవేద్యం, తీర్థప్రసాదాలు సమర్పించాలి. ఈ పూజ తర్వాత మీరు ఆహారాన్ని, నీటిని తీసుకోవాలి.

దానం చేయాలి:-

చంద్రగ్రహణం తర్వాత ఆచరించాల్సిన మరో కార్యక్రమం దానం చేయడం. గ్రహణం విడిచిన తర్వాత దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అంటున్నారు. చంద్రగ్రహణం తర్వాత ముఖ్యంగా తెలుపురంగు వస్తువులను దానం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది అంటున్నారు పండితులు.అందుకే అక్షతలు, తెలుపు వస్త్రాలు, పాలు, పెరుగు లాంటి వాటిని దానం చేస్తే మంచిది అంటున్నారు. గ్రహణం తర్వాత గురుసమానులకు, బ్రాహ్మణులకు వీటిని దానం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది అంటున్నారు పండితులు.