నిలకడగా నందమూరి తారకరత్న ఆరోగ్యం.. పూర్తి వివరాలు..

నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమచారం. ఆదివారం కొంతమంది మీడియా ప్రతినిధులకు తారకరత్న చికిత్స తీసుకుంటున్న చోటు దగ్గరకు వెళ్లటానికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. స్వయంగా తారకరత్నను చూసిన సదరు మీడియా ప్రతినిధులు ఆయన కోలుకుంటున్నట్లు గుర్తించారట. ఇక, వైద్యులు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. స్టంట్‌ వేయటం ఇ‍బ్బందిగా మారుతుందని భావించిన వారు.. ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. స్టెప్‌ బై స్టెప్‌ తారకరత్న ఆరోగ్యం విషయంలో కేర్‌ తీసుకుంటున్నారు.

ఇప్పటికే నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా నారాయణ ఆసుపత్రికి వెళుతున్నారు. నిన్న సాయంత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు ఆసుపత్రికి వెళ్లారు. ఆ పరిస్థితిలో తమ అన్నను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం జూనియర్‌ ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 27వ తారీఖు తమ కుటుంబంలో చాలా దురదృష్టకరమై సంఘటన జరిగిందని వాపోయారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తారకరత్నకు అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు చాలా అవసరమని పేర్కొన్నారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అన్నయ్య త్వరలోనే కోలుకుని ఎప్పటిలాగే అందరితో ఆనందంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు. కాగా, శుక్రవారం నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు.

యాత్రలో నడుస్తూ తన మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వెంటనే మరో  ఆసుపత్రికి తరలించారు. అక్కడ శుక్రవారం రాత్రి వరకు వైద్యం అందించిన తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకువచ్చారు. తారకరత్న ఆరోగ్యం బాగవ్వాలని నందమూరి అభిమానులతో పాటు టీడీపీ వర్గాలు సైతం ఎంతో ప్రార్థిస్తున్నాయి. వారి ప్రార్థనలు ప్రస్తుతం ఫలించినట్లు అయింది. తారకరత్న కొద్దికొద్దిగా కోలుకుంటున్నారు. మరి, తారకరత్న ఆరోగ్యం మరింత మెరుగవ్వాలని కోరుకుంటూ మీ ప్రార్థనలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.