ప్రీతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. కొంపముంచిన రూ. 50 లక్షల అడ్మిషన్ బాండ్!

సీనియర్‌ విద్యార్థి వేధింపులు భరించలేక వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆ‍త్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ప్రీతి కేసు విషయంలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వరంగల్‌ కేఎంసీ కాలేజీలో పీజీ చదువుతోన్న ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందారు. వైద్యురాలిగా మారి సేవ చేయాలని ఎన్నో ఆశలతో ముందుకు వెళ్లి.. చివరికి సీనియర్ విద్యార్థి సైఫ్ అనే దుర్మార్గుడి వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రీతి మరణానికి కారణమైన నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సోమవారం ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రీతి కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ప్రీతి కేసులో మరో వార్త చక్కర్లు కొడుతుంది.వైద్య విద్యలో  సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ రూ.50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తరువాత ఏవైనా కారణాలతో కోర్సు మధ్యలో డ్రాప్ అయితే విశ్వవిద్యాలయానికి డబ్బులు చెల్లించాలి. ఇదే ప్రీతి పాలిట శాపమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది వర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలో వదులుకుంటే రూ.20 లక్షలు చెల్లించాలనే నిబంధన ఉండేది. అయితే చాలా మంది వైద్య విద్యార్థులు మధ్యలోనే వెళ్లిపోతున్నారనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.50 లక్షలు పెంచింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో చాలా మంది విద్యార్థులు కాలేజీ వదిలి వెళ్లేందుకు ధైర్యం చేయటం లేదని కొందరి వాదన.

అలాగే వేధింపులు, ర్యాగింగ్, ఇతరత్ర ఇబ్బందులు ఉన్నా వాటిని భరిస్తూ పీజీ పూర్చి చేస్తున్నారని వాదనలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ప్రీతి విషయంలో కూడా ఇదే జరిగిందనే వాదనలు తెరపైకి వచ్చాయి. సైఫ్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో పీజీ రావొచ్చు కదా? అని ఆమె తండ్రి నరేందర్ చెప్తారు. ఆ సమయంలో ప్రీతి చాలా వేదనకు గురైందని సమాచారం. రూ.50 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది కదా?.. అంత డబ్బును ఎలా ఇవ్వగలవని ఆమె చివరి మాటల్లో చెప్పినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. వేధింపులు తట్టుకోలేక, మధ్యలో డ్రాప్ అయితే అంత మొత్తంలో డబ్బులు చెల్లించలేమని ప్రీతి తీవ్ర మనోవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వేధింపులు, ర్యాంగింగ్ లపై కఠిన  చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. అలానే ప్రభుత్వం కొత్త అడ్మిషన్ బాండ్ నిబంధనలు తీసుకురావాలని, లేదా విద్యార్థినులకు న్యాయం జరిగిలే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.