ప్రీతి గదిలో మరి కొన్ని ఇంజెక్షన్లు.. గూగుల్‌లో మరో ఇంజెక్షన్‌ కోసం సెర్చ్‌.. అసలేం జరిగింది!

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మరణంలో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన రోజున పాయిజనస్‌ ఇంజెక్షన్‌ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె గదిలో మరి కొన్ని ఇంజెక్షన్లు వెలుగు చూశాయి. అసలు ప్రీతి ఏ ఇంజెక్షన్‌ తీసుకుంది.. ఎలా చనిపోయింది అనే దాని గురించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఆ వివరాలు.. డాక్టర్‌ అయ్యి పేదలకు సేవ చేయాలని భావించింది. తన భవిష్యత్తు గరించి ఎన్నో కలలు కన్నది. వాటిని సాధించుకునే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతోంది. తండాలో పుట్టిన ఓ యువతి.. మట్టిలో మాణిక్యంలా మెరిసి.. చదువులో రాణించి.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని భావించింది.

బిడ్డ కన్న కలలను నిజం చేయడం కోసం ఆమె తల్లిదండ్రులు కూడా అన్ని విధాల మద్దతు తెలిపారు.. అండగా నిలిచారు. మరి కొన్నిరోజుల్లో ప్రీతి జీవితాశయం నేరవేరేది. కానీ ఓ కర్కోటకుడు చేసిన పనికి.. ఆ చదువుల తల్లి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆమె కన్న కలలు కల్లలు అయ్యాయి. బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని గుండె కోత మిగిలింది. సీనియర్‌ విద్యార్థి వేధింపులు భరించలేక.. తన జీవితాన్ని అంతం చేసుకోవాలని భావించింది. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఇక ప్రీతి మృతి నేపథ్యంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆ వివరాలు.. ప్రీతి.. ఓ పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలు వచ్చాయి. కానీ ప్రీతి గదిలో మరికొన్ని ఇంజెక్షన్‌ వాయిల్స్‌ కనిపించడంతో.. అసలేం జరిగింది.. ఆమె ఏ ఇంజెక్షన్‌ తీసుకుంది అనే దాని గురించి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ప్రీతి గదిలో సక్సినైల్‌కోలైన్‌, మెడజోలం, పెంటనీల్‌ ఇంజక్షన్‌ వాయిల్స్‌ దొరికాయి. ఇవే కాక ప్రీతి గూగుల్‌లో మరో ఇంజెక్షన్‌ గురించి కూడా సెర్చ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు.. అనగా ఫిబ్రవరి 21 మంగళవారం నాడు ఆమె ఎంజీఎం ఆస్పత్రిలో నైట్‌ డ్యూటీలో ఉంది. రాత్రి 12 గంటల వరకు రెండు ఆపరేషన్‌లలో పాల్గొంది. ఇక బుధవారం తెల్లవారుజామున ఆమె తనకు తలనొప్పి, ఛాతిలో నొప్పిగా ఉందంటూ..

జోఫర్‌, ట్రెమడాల్‌ ఇంజెక్షన్‌ కావాలని సాఫ్ట్‌ నర్స్‌ని అడిగింది. ఆ తర్వాత ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మరాక స్థితిలో పడిపోయి ఉండటాన్ని గమనించిన తోటి వైద్యులు.. ఆమెకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందని భావించి.. సీపీఆర్‌ ద్వారా గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. ఉన్నతాధికారులు.. బుధవారం మధ్యాహ్నం ప్రీతిని నిమ్స్‌కు తరలించారు. తొలుత ప్రీతిని పరీక్షించిన వైద్యులు.. ఆమె ట్రెమడాల్‌ ఇంజెక్షన్‌ ఓవర్‌డోస్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని భావించారు. కానీ ఆమె గదిలో మరి కొన్ని ఇంజెక్షన్‌ వాయిల్స్‌, గూగుల్‌లో మరో ఇంజెక్షన్‌ కోసం సెర్చ్‌ చేసినట్లు తేలడంతో..

ఆమె ఏ మందు తీసుకుంది అనే విషయం గుర్తించడం కోసం ప్రీతి బ్లడ్‌ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఈ రిపోర్టు వస్తే కానీ.. ప్రీతి మృతికి సరైన కారణాలు తెలియవు అంటున్నారు వైద్యులు. ఇక ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్‌ పీజీ సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై వరంగల్‌ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 24న సైఫ్‌ను అరెస్ట్‌ చేశారు.. 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు. అంతేకాక సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నేరం రుజువైతే.. కాలేజీ నుంచి సస్పెండ్‌ చేస్తామని తెలిపారు. పోస్ట్‌ మార్టం నివేదిక వస్తే.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్స్‌ రూపంలో తెలియజేయండి.