బ్రెస్ట్‌ క్యాన్సర్ లక్షణాలు, నివారణ మార్గాలు.. ఈ చిన్న టెస్ట్‌తో ఎవరికి వారే గుర్తించవచ్చు!Breast Cancer Symptoms

ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్రెస్ట్‌ క్యాన్సర్‌. వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. అయితే మరి ఈ మహమ్మారిని ముందుగా గుర్తించలేమా.. నివారించలేమా అనే దాని గురించి నిపుణులు ఏమంటున్నారంటే.. క్యాన్సర్‌ ఈ మహమ్మారి చాప కింద నీరులా ప్రవహించి.. ఎన్నో కుటుంబాలను.. ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. ఒకప్పుడు దురలవాట్లు ఉన్న వారు మాత్రమే క్యాన్సర్‌ బారిన పడతారు అనే అభిప్రాయం ఉండేది. కానీ నేటి కాలంలో వెలుగు చూస్తున్న కేసులను చూస్తే.. క్యాన్సర్‌ బారిన పడటానికి దురలవాట్లు, వయసుతో సంబంధం లేదని అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో మహిళలు కూడా అధిక సంఖ్యలో క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. మన దేశంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ముందే చెప్పుకున్నట్లు క్యాన్సర్‌ మహమ్మారి చాప కింద నీరులా మన శరీరంలో చేరి.. తీవ్ర రూపం దాల్చక బయటపడుతుంది. దాంతో ఏం చేయలేని పరిస్థితి తలెత్తుతుంది.

దేశంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో.. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి.. నివారణ చర్యలు ఏంటి.. దీన్ని ముందే తెలుసుకునే అవకాశం ఉందా వంటి వివరాలు మీకోసం.. 40 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా విధిగా క్యాన్సర్‌ టెస్ట్‌ చేయించుకోవాలని అంటున్నారు వైద్యులు. అయితే ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల పైబడిన మహిళలు, యువతుల్లో కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చాలా మందిలో క్యాన్సర్‌ బారిన పడినట్లు.. వాళ్లు ముందుగా గుర్తించలేకపోతున్నారు. తీవ్ర రూపం దాల్చక మాత్రమే క్యాన్సర్‌ బారిన పడినట్లు గుర్తించగలుగుతున్నాం. మరి ప్రారంభం దశలోనే దీన్ని గుర్తించలేమా అంటే.. గుర్తించవచ్చు అంటున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా ఎవరికి వారు.. ఆస్పత్రలుకు వెళ్లే అవసరం లేకుండానే ఇంట్లోనే తమకు తామే చెక్‌ చేసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అంతేకాక బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడ్డ వాళ్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు. నిపుణులు. ఆ వివరాలు..

లక్షణాలు..

  • మీరు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడితే.. మీ ఛాతి మీద చర్మం లోపలకి వెళ్లి సొట్టలు పడ్డట్లుగా ఉంటుంది.
  • ఇక వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది.
  • అలానే బ్రెస్ట్‌ నిపుల్స్‌ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి రాలిపోతుంది.
  • బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉంటే ఛాతి చర్మం రంగు మారుతుంది. మిగతా శరీర భాగాల కన్నా.. బ్రెస్ట్‌ చర్మం రంగు భిన్నంగా ఉంటుంది.
  • నిపుల్స్‌ని నొక్కితే అవి లోపలికి వెళ్లకపోవడం, రెండు వక్షోజాలు వేర్వేరు సైజుల్లో ఉన్నా మీరు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడినట్లు అనుమానించాలి.
  • అలానే నిపుల్స్‌ని నొక్కినప్పుడు వాటి నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా ద్రవం బయటకు వస్తే.. అనుమానించాల్సిందే.
  • అలానే వక్షోజాలు, చంకల్లో గడ్డలు ఉన్నట్లుగా అనిపించినా, రొమ్ములపై చర్మం ముడతపడటం, గట్టిగా మారినా.. వక్షోజాలపై గుంటలు ఏర్పడటం, బ్రెస్ట్‌ చర్మం నారింజ రంగులోకి మారితే.. అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు.

40 ఏళ్లు దాటితే మామోగ్రఫీ మస్ట్‌..

ఇక 40 ఏళ్లు పైబడిన స్త్రీలు తప్పకుండా మామోగ్రఫీ టెస్ట్‌ చేయించుకోవాలి అంటున్నారు వైద్యులు. దీని ద్వారా వక్షోజాలను స్కాన్‌ చేసి.. లోపల ఏవైనా గడ్డలు ఉన్నాయా… అని టెస్ట్‌ చేస్తారు. గడ్డలు కనిపిస్తే.. అవి క్యాన్సర్‌ గడ్డలా కాదా తేల్చడం కోసం ఎక్స్‌ రే తీస్తారు. దీన్నే మామోగ్రఫీ టెస్ట్‌ అంటారు. అయితే ఇలా ఎక్స్‌రే తీయడం ద్వారా కొంత మొత్తంలో ఎక్స్‌రే కిరణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది మన శరీరానికి హనికరం కాబట్టి.. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇలా మామోగ్రఫీ చేయించుకోవాలని చెబుతున్నారు వైద్యులు.

మరి ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల పైబడిన వారిలో కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వెలుగు చూస్తుంది. మరి వీళ్లు.. ఎలా గుర్తించాలి అంటే.. 20 ఏళ్లు దాటిని తర్వాత మహిళలు, యువతులు.. ఎవరికి వారే ప్రతి నెల టెస్ట్‌ చేసుకుంటే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని తొలి దశలోనే గుర్తించవచ్చు అంటున్నారు వైద్యులు. ప్రతి నెలా ఇలా టెస్ట్‌ చేయడం వల్ల.. వక్షోజాల్లో వచ్చే మార్పులు, తేడాలు మనకు సరిగా అర్థం అవుతాయి అంటున్నారు నిపుణులు. అదే 40 ఏళ్లు పైబడని వారు మాత్రం తప్పకుండా ప్రతి రెండేళ్లకు ఒకసారి మామోగ్రఫీ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

సెల్ఫ్‌ టెస్ట్‌ ఎలా చేసుకోవాలంటే..

  • 20 ఏళ్ల వరకు మహిళల్లో బ్రెస్ట్‌ అభివృద్ధి జరుగుతుంది. అందుకే 20 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళ.. ప్రతి నెల తనకు తాను స్వయంగా టెస్ట్‌ చేసుకోవాలి.
  • పిరియడ్స్‌ అయిపోయిన తర్వాత.. పడుకుని అయినా.. స్నానం చేసేటప్పుడు అయినా సరే ఈ టెస్ట్‌ చేసుకోవచ్చు.
  • దీనిలో భాగంగా మీరు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశలో అంటే సవ్య, అపసవ్య దిశలో వక్షోజాలను నొక్కుతూ పరీక్షించాలి.
  • ఇలా పరీక్షించే సమయంలో మీకు ఏవైనా గడ్డల్లా తగిలితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

అన్ని గడ్డలు క్యాన్సర్‌ కాదు..

  • అయితే ఇలా టెస్ఠ్‌ చేసుకునే సమయంలో ఏవైనా గడ్డలు తగిలితే పెద్దగా భయపడాల్సిన పని లేదు అంటున్నారు వైద్యులు.
  • ముందుగా ఆ గడ్డలు వక్షోజాల్లో ఉన్న కొవ్వులో వచ్చాయా.. లేక పాలు తయారు చేసే భాగంలో వచ్చాయా అనేది పరిశీలిస్తారు.
  • కొవ్వు భాగంలో గడ్డలు వస్తే క్యాన్సర్‌ అవ్వదు.. పాలు తయారయ్యే భాగంలో వస్తే కచ్చితంగా క్యాన్సర్‌ అనే చెప్పవచ్చు.
  • మన వక్షోజాల్లో 98 శాతం కొవ్వు ఉంటుంది. ఇలా కొవ్వులో గడ్డలు వస్తే.. ప్రమాదం ఏమి లేదు. కాకపోతే ఇవి తగ్గవు.. వీటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
  • అలా కాకుండా పాలు తయారయ్యే భాగంలో గడ్డలు ఉన్నట్లు తెలిస్తే.. బయాప్సీ చేసి.. కావాల్సిన చర్యలు తీసుకుంటారు.

నివారణలు..

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను నివారించడం మన చేతుల్లో లేదు. కానీ 20 ఏళ్లు దాటిన వారు ప్రతి నెల సెల్ఫ్‌ టెస్ట్‌ చేసుకోవడం, 40 ఏళ్లు పైబడిన వారు రెండేళ్ల కోసారి మామోగ్రఫీ టెస్ట్‌ చేయించుకోవడం వల్ల ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. అలానే మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే దీని బారిన పడకుండా ఉండవచ్చు. అలానే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్‌ బారిన పడితే.. ఆ కుటుంబ సభ్యులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చిన వైద్యులను సంప్రదించాలి అంటున్నారు.

జాగ్రత్తలు..

  • వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. సరిపడా రెస్ట్‌ తీసుకోవాలి.
  • ఇక మహిళలు వేళకు భోజనం చేయాలి. బరువు కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
  • ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు భాగం చేసుకోవాలి.
  • ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  • రోజు తీసుకునే ఆహారంలో 40 శాతం ఆహారం ఫ్రెష్‌గా, ఉడకబెట్టని ఆహారం అంటే తాజా పండ్ల, కూరగాయలు భోజనంలో భాగం చేసుకోవాలి.
  • పసుపు, ఎరుపు, వంగ రంగు పళ్లు, కూరగాయాలు భోజనంలో భాగం చేసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
  • అలానే 20 ఏళ్లు దాటిన వారు నెలనెలా సెల్ఫ్‌ టెస్ట్‌, 40 ఏళ్లు దాటిన వారు 2 ఏళ్లకు ఓసారి మామోగ్రఫీ టెస్ట్‌లు చేయించుకోవడం మర్చిపోవదు.
  • ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల క్యాన్సర్‌ ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.