బ్రేకింగ్: ముగిసిన కవిత ED విచారణ! 9 గంటల పాటు..!

కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ మహిళా నేత కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఆమెని ప్రశ్నించిన అధికారులు.. శనివారం సాయంత్రం విడిచిపెట్టారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బీఆర్‌ఎస్‌ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని దాదాపు 9 గంటలకు పైగా విచారించారు. ఆమెను అదుపులోకి తీసుకుంటారని అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు.

కాగా, శనివారం ఉదయం కవిత విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అధికారులు కేవలం ఆమెను మాత్రమే లోపలికి అనుమతించారు. ఆఖరికి ఆమె భర్తను కూడా ఆఫీస్‌ లోపలికి వెళ్లనివ్వలేదు. అంతేకాదు! ఈడీ ఆఫీస్‌ చుట్టు పక్కల 144 సెక్షన్‌ను విధించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జాయింట్‌ డైరెక్టర్‌ సహా ఆరుగురు సభ్యులు కవితను విచారించినట్లు తెలుస్తోంది.

PMLA సెక్షన్ 50 కింద కవితని ప్రశ్నించిన అధికారులు, స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 9 మందిని ఒకేసారి విచారించినట్లు సమాచారం. కవితో పాటు మనీష్‌ సిసోడియా, అరుణ్‌ పిళ్లై, దినేష్‌ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్‌, మాజీ అధికారులు కుల్దీప్‌ సింగ్‌, నరేంద్ర సింగ్‌లను ఏక కాలంలో ఈడీ విచారించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అధికారులు కవిత, పిళ్లైని కన్‌ఫ్రంటేషన్‌ ఇంటరాగేషన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ధ్వంసం చేసిన 10 ఫోన్ల నుంచి సమాచారాన్ని రికవరీ చేసి, వాటిపై కూడా విచారణ చేశారట. ప్రస్తుతం కవిత ఉపయోగిస్తున్న ఫోన్ ని ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ITC కోహినూర్‌ డీల్ తర్వాత హవాలాలో ఎన్నికోట్లు చేతులు మారాయి? ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో హవాలాకు సహకరించింది ఎవరు? అన్న ప్రశ్నలను కవిత ముందు ఈడీ ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈడీ ఆఫీస్‌ వద్దకు చేరుకున్నారు. ఇటు హైదరాబాద్‌లోని కేసీఆర్‌ ఇంటి ముందు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని పరిస్థితులను కేసీఆర్‌ ఎప్పుటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. కవితను విచారణ నేపథ్యంలో ఆమె కుటుంబంలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి కవితని ఈడీ అధికారులు 9 గంటలు విచారించడంపై మీరేం అనకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.