శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య.. తన కొడుకును చంపేశారంటూ తల్లి ఆవేదన..

కాలేజీలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులను భరించలేక ఇటీవల ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరణించింది. ప్రీతి ఘటన మరువక ముందే మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, లెక్చరర్ల టార్చర్ వంటి పలు కారణాల వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు గతంలో చాలా చూసాం. మంచి మార్కులు రాకపోతే భూమ్మీద బతికే హక్కే లేదన్నట్టు కొన్ని కాలేజీలు వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్నా గానీ పట్టించుకోవడం లేదు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగా విద్యార్ధి ఛాప్టర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి పదిన్నర సమయంలో తరగతి గదిలో ఉరి వేసుకున్నాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే తమ స్నేహితుడు ఉరి వేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపించారు. ఒక బైకర్ ను లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తరలించారు. క్యాంపస్ లో హాస్టల్ లో ఉంటున్న సాత్విక్.. రాత్రి పదిన్నర గంటల సమయంలో క్లాస్ రూమ్ కి వెళ్లి ఉరి వేసుకున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. లెక్చరర్స్ ఒత్తిడి వల్లే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని స్నేహితులు ఆరోపిస్తున్నారు. సాత్విక్ తల్లిదండ్రులు, విద్యార్థులు కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు.

సాత్విక్ ను లెక్చరర్లు పదే పదే ఫెయిల్యూర్ అనేవారని.. అందరి ముందు కొట్టేవారని.. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని విద్యార్థులు అంటున్నారు. తమ పట్ల కూడా లెక్చరర్లు దారుణంగా ప్రవర్తించేవారని కాలేజ్ విద్యార్థులు అంటున్నారు. కొంతమంది లెక్చరర్లు బానే ఉంటారని.. కొందరు మాత్రం సైకోల్లా బిహేవ్ చేసేవారని చెబుతున్నారు. ఒక విద్యార్థినైతే రక్తం వచ్చేలా కొట్టారని వెల్లడించారు. క్యాంపస్ నుంచి కాలేజీ స్టాఫ్ ఒక్కరు కూడా సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రాలేదని.. తామే ఒక బైకర్ ను లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో ఎవరేం అన్నారో.. చెట్టంత కొడుకును నాకు లేకుండా చేశారంటూ సాత్విక్ తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.