సమంతకు వచ్చిన వ్యాధి అంత ప్రాణాంతకమా? మ్యోసిటిస్‌ పూర్తి వివరాలు.

ప్రముఖ సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ‘‘మ్యోసిటిస్‌’’ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాను మ్యోసిటిస్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా ఆమే తన సోషల్‌ మీడియా ఖాతాల్లో చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోస్టులు పెట్టారు. ‘‘ కొన్ని రోజుల క్రితం నాకు ఓ ఆటో ఇమ్యూన్‌ కండీషన్‌ ఉన్నట్లు తేలింది. దాని పేరు మ్యోసిటిస్‌. నేను ఇది తగ్గిన తర్వాత ఈ విషయం గురించి మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ, ఇది తగ్గటానికి చాలా టైం తీసుకునేలా ఉంది. నేను త్వరలో దీన్నుంచి కోలుకుంటాన’’ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మ్యోసిటిస్‌ వ్యాధి గురించి నెటిజన్లు వెతకటం మొదలు పెట్టారు. ఆ వ్యాధి ఏంటి? దాని లక్షణాలు ఏంటి? అన్న వివరాల గురించి సెర్చ్‌ చేస్తున్నారు. ఇంతకీ ‘‘మ్యోసిటిస్‌’’ ఏంటి? ఆ వ్యాధి ప్రాణాంతకమా అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

మ్యోసిటిస్‌ అనేది కొన్ని అరుదైన కండీషన్ల కలయిక. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో సమస్య కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. మ్యోసిటిస్‌లో పలు రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే.

  • పోలీమ్యోసిటిస్‌ : పోలీమ్యోసిటిస్‌ శరీరంలోని వివిధ రకాల కండరాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా భుజాలు, నడుము, తొడల కండరాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ఇది మహిళల్లో తరచుగా వస్తూ ఉంటుంది. అది కూడా 30 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారికి.
  • లక్షణాలు : కండరాళ్ల బలహీనత, కండరాళ్లు నొప్పి తీయటం, అతి నీరసం, కూర్చోవటంలో ఇబ్బంది కలగటం.. ఒకవేళ కూర్చుంటే నిలబడటటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. మింగటంలో కూడా సమస్యలు వస్తాయి. తల పైకెత్తి ఎక్కువ సేపు ఉంచలేము. ఎప్పుడూ బాధగా ఉండటం, ఒత్తిడికి గురవటం జరుగుతుంది.
  • డెర్మటోమ్యోసిటిస్‌ : డెర్మటోమ్యోసిటిస్‌ కారణంగా శరీరంలోని వివిధ రకాల కండరాళ్లపై ప్రభావం పడుతుంది. దద్దుర్లలకు దారి తీస్తుంది. ఇది మహిళల్లో తరచుగా వస్తుంది. అంతేకాదు.. పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుంటుంది. పిల్లల్లో దీన్ని జువెనల్‌ డెర్మటోమ్యోసిటిస్‌ అంటారు.
  • లక్షణాలు : ఈ వ్యాధిలో కూడా పోలీమ్యోసిటిస్‌కు ఉన్న లక్షణాలే ఉంటాయి. అయితే, ఇందులో దద్దుర్లు కూడా ఉంటాయి. కండరాల్లో నొప్పి రావటానికి ముందే ఎరుపు, పర్పుల్‌, నల్లటి దద్దుర్లు కనిపిస్తాయి. కనురెప్పలు, ముక్కు, బుగ్గలపై దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి ఇవి నడుము, పై రొమ్ము, మోకాళ్లపై వస్తుంటాయి. ఈ వ్యాధిలో దద్దుర్లు దురదను కలిగించటంతోపాటు నొప్పిగా కూడా ఉంటాయి. చర్మం కింద గట్టి గుజ్జుకూడా ఉంటుంది.
  • ఇన్‌క్ల్యూషన్‌ బాడీ మ్యోసిటిస్‌ : ఈ వ్యాధి ప్రభావం కారణంగా తొడల కండరాళ్లు, ముంజేయి, మోకాళ్ల కింది కండరాళ్లు బలహీనపడతాయి. అంతేకాదు.. ఇది మింగటంలో కూడా ఇబ్బందిని కలుగజేస్తుంది. ఈ వ్యాధి తరచుగా మగాళ్లకు వస్తుంది. అది కూడా 50 సంవత్సరాలు పైబడిన వారిలో..

మ్యోసిటిస్‌ను గుర్తించే పరీక్షలు 

వైద్యులు రక్త పరీక్షల ద్వారా మన శరీరంలోని ఎంజైమ్స్‌, యాంటీ బాడీల పెరుగుదలను గుర్తిస్తారు. కొద్దిగా కండరాళ్ల కణజాలం లేదా చర్మాన్ని తీసి పరీక్ష చేస్తారు. తద్వారా వాపు, డ్యామేజ్‌ ఇతర విషయాలను కనుగొంటారు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్స్‌ ద్వారా కూడా ఈ వ్యాధి గుర్తించవచ్చు.

ఈ వ్యాధిని తగ్గించుకోవటానికి ఏం చేయాలి

వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకోవటం ఎంతో ముఖ్యం. వారు చెప్పిన విధంగా వ్యాయామం చేయటం ఎంతో ఉపయోగపడుతుంది. కండరాళ్ల వాపును తగ్గించటంతో పాటు కొత్త శక్తిని ఇస్తుంది. ఫిజియోథెరపీ కూడా అన్ని రకాల మైసిటిస్‌ను తగ్గించటానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి.. స్టేజీలకు తగిన విధంగా చికిత్స చేయించుకోవాలి. సరైన చికిత్స అందకపోయినా.. అసలు చికిత్స తీసుకోకపోయినా నష్టం తప్పదు. ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది ..