సమంత ‘మయోసైటిస్’ వ్యాధికి మంతెన సత్యనారాయణ చిట్కా ..!

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల యశోద మూవీ రిలీజ్ కి ముందు సమంత తనకు ఈ వ్యాధి ఉందనే విషయాన్నీ బయటపెట్టింది. దీంతో మయోసైటిస్ వ్యాధి ఎంతో ప్రమాదం అంటూ.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు అందరినీ కంగారు పెట్టేశాయి. కానీ.. ఈ అరుదైన మయోసైటిస్ వ్యాధిని కూడా సహజ సిద్ధంగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ. రీసెంట్ గా కండరాల సమస్యల గురించి మాట్లాడుతూ..

ఈ మయోసైటిస్ ని ఎలా నయం చేసుకోవచ్చో ఓ వీడియో ద్వారా తెలియజేశారు. సాధారణంగా మంతెన సత్యనారాయణ ఆరోగ్య సూత్రాలను తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ఫాలో అవుతుంటారు. రెగ్యులర్ పలు టీవీ కార్యక్రమాలలో కూడా ఈయన ఆరోగ్య సలహాలు ఇస్తుంటారు. కాగా, తాజాగా మయోసైటిస్ గురించి మాట్లాడుతూ.. శరీరంలో కండరాలకు వచ్చే పెద్ద సమస్యలలో ఈ మయోసైటిస్ ఒకటని చెప్పారు. మన శరీరంలో ఉండే రక్షక దళాలు.. కండరాల కణాలను దాడి చేస్తాయని.. అలా చేయడం వల్లే శరీరంలో కండరాలు దెబ్బ తింటాయని అన్నారు. శరీరంలో తెల్ల రక్తకణాలు రిలీజ్ చేసే కెమికల్స్.. కండరాలపై ప్రభావం చూపినప్పుడు ఈ ‘మయోసైటిస్’ వ్యాధి వ్యాప్తి చెందుతుందని..

ఈ వ్యాధి లక్షమందిలో 22 మందికి వచ్చే అవకాశం ఉన్నట్లు మంతెన సత్యనారాయణ తెలిపారు. మంతెన ఇంకా మాట్లాడుతూ.. అలా 22 మందిలో మయోసైటిస్ వ్యాధి లక్షణాలు కనిపించినా.. ఐదుగురిలో మాత్రమే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కండరాలు బాగా వీక్ అయ్యేలా చేస్తుంది. ఈ వ్యాధి తీవ్రత పెరిగినప్పుడే లక్షణాలు బయట పడతాయి. ఇక మయోసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. సరిగ్గా నడవలేకపోవడం, కండరాల పటుత్వం తగ్గడం, నడిచేటప్పుడు పడిపోవడం, చర్మ వ్యాధులు, స్కిన్ పై మచ్చలు, గొంతు సమస్యలు, బాగా నీరసం, అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి జరుగుతుంటాయి. అలా వ్యాధి తీవ్రత బట్టి.. ఏయే కండరాలపై అటాక్ చేయాలో దశలు మారుస్తుంటుంది.

ఈ మయోసైటిస్ వ్యాధి ఎక్కువగా 30 – 60 ఏళ్ల మధ్య వయసు వారికే వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. ఈ మయోసైటిస్ వ్యాధిలో మొత్తం నాలుగు రకాలు ఉంటాయి. 1. ఆటోఇమ్యూన్ మయోపతి, 2. పాలీ మయోసైటిస్, 3. డెర్మటోమయోసైటిస్, 4. ఇంక్లూసన్-బాడీ మయోసైటిస్. అయితే.. ఇందులో 4వ రకం చాలా ప్రమాదకరం. ఇది గొంతు కండరాలపై ప్రభావం చూపి.. ఆహారం తినకుండా చేస్తుందని మంతెన తెలిపారు. ఇక ఈ వ్యాధిని నయం చేసుకోడానికి స్టెరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే.. మయోసైటిస్ కూడా కండరాలకు సంబంధించింది కాబట్టి.. సహజ సిద్ధంగా తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి.

ఆ మార్గాలు ఏంటంటే:-

  • ఆవనూనె, ముద్దకర్పూరం కలిపి దాన్ని వేడి చేసి, ఆ నూనెతో మసాజ్ చేసుకుని వేడి నీళ్ల కాపడం పెట్టుకోవాలి. ఇది కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్న భాగంలో.. కట్లు కట్టుకుని కాపడం పెట్టుకోవాలి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే :-

  • అవిసెగింజల్ని దోరగా వేగించి తీసుకోవడం లేదా వాల్ నట్స్ బాగా మంచివి
  • బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. వరి తవుడు, తవుడుని పుల్కా పిండిలో కలుపుకోవడం లేదా నీళ్లలో కలుపుకుని తీసుకున్నా ఓకే. ఎందుకంటే.. మయోసైటిస్ వ్యాధిని తగ్గించే పోషకాలు తవుడులో ఉంటాయి
  • ఉప్పులేని ఆహారం కండరాల నొప్పిలకు మంచి నివారణ. ఉప్పు తీసుకోవడం ఆపేస్తే.. మయోసైటిస్ నుంచి పూర్తిగా బయటపడొచ్చు
  • రాత్రి పూట డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకొని.. వండిన ఆహారాన్ని అవాయిడ్ చేస్తే మంచిది
  • ఉదయం వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే మంచిది. ఈ జ్యూస్ రక్త ప్రసరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది
  • ఈ నేచురల్ డైట్ తో పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటే త్వరగా నయం అవుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురవ్వకూడదు
  • రెగ్యులర్‌ గా ధ్యానం.. వ్యాయామం చేస్తే.. మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు

ఈ రకమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే మయోసైటిస్‌ని శరీరం నుంచి తరిమికొట్టొచ్చని చెప్పారు మంతెన సత్యనారాయణ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.