హార్ట్ ఎటాక్ వచ్చేవాళ్లలో 90 శాతం సిగరెట్ తాగేవాళ్లే

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లు ఎక్కువగా గుండెపోటు గురౌతున్నారు. చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గతంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్..  తాజాగా నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి విదితమే. కుప్పంలో శుక్రవారం నారా లోకేష్ చేపడుతున్న యువగళం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. తొలుత చిత్తూరులోని ఓ ఆసుప్రతికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం రాత్రి బెంగళూరుకు తరలించారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎక్మో ట్రీట్ మెంట్‌ను వైద్యులు అందిస్తున్నారు.

కాగా, చిన్న వయసులో గుండెపోటు రావడంపై గుండె వైద్య నిపుణులు డా. ముఖర్జీ స్పందించి, పలు సూచనలు అందించారు. తారకరత్నకు స్మోకింగ్ చేసే అలవాటు ఎక్కువగా ఉందని సన్నిహితులు చెబుతున్నారని, దాని వల్లే ఆయనకు గుండె పోటు తీవ్రత స్థాయి ఎక్కువగా ఉందన్నారు. 40 ఏళ్ల లోపల హార్ట్ ఎటాక్ వచ్చేవాళ్లలో 90 శాతం మంది స్మోకర్లే ఉన్నారని అన్నారు. కోవిడ్ వచ్చి తగ్గాక ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్ ఏదైనా ఉన్నవాళ్లకి టెస్ట్ చేసుకున్నట్లు గానే, మనం గుండెకు సంబంధించిన పరీక్షలు (ఇసిజి, ఎకో, థ్రెడ్ మిల్ వంటివి) చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ బారిన పడిన వారు, షుగర్, బిపి వంటి వాటితో బాధపడుతున్న వారు, ఇతరులు కూడా గుండె పోటు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

సరైన ఆహారం, స్మోకింగ్ కు దూరంగా ఉండటం, వ్యాయామం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, బరువును నియంత్రించుకోవడం, షుగర్, బిపి ఉన్న వాళ్లు మందులు జాగ్రత్తగా తీసుకోవడం వంటివి తీసుకోవాలని సూచించారు. గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ బారిన పడకుండా చేసుకోవచ్చునని అన్నారు. అలాగే సిపిఆర్ (గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, దాని పునర్జీవానికి చేసే అత్యవసర చికిత్స) ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తెలిపారు. పబ్లిక్ యాక్సెస్ డీసిబులేటర్ అనేవి పబ్లిక్ ప్రాంతాల్లో నెలకొల్పాలని, వాటిని వినియోగం అందరూ నేర్చుకోవాలన్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణించాక.. అందరికీ తెలియాలని దర్శకుడు రాజమౌళితో అవగాహన కల్పించామన్నారు.