Jr NTR : తార‌క‌ర‌త్న క్రిటిక‌ల్ కండీష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డలేదు.. పోరాడుతూనే ఉన్నారు : జూనియ‌ర్ ఎన్టీఆర్,బాలకృష్ణ

నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ముందుగా అక్కడికి చేరుకున్న బాలకృష్ణ, ఈరోజు అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. “యువగళం యాత్రలో మాసీవ్ హార్ట్ అటాక్‌ తో తారకరత్న కుప్పకూలాడు. హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినప్పటికీ.. ఆ తర్వాత మిరాకిల్ జరిగి మళ్లీ హార్ట్ బీట్ మొదలైంది. బెటర్ ఐసీయూ కేర్ కోసం నారాయణ హృదయాలయకు తీసుకొచ్చాము. డాక్టర్స్ ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తూ కేర్ తీసుకుంటున్నారు అన్నారు.

‘కుప్పం నుండి ఏ పరిస్థితుల్లో తీసుకువచ్చారో.. ప్రస్తుతం పరిస్థితుల్లో తారకరత్న పరిస్థితి ఉంది. కానీ.. అంతా నిలకడగానే ఉంది. ఇంప్రూవ్‌ మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. అందరి ఆశీస్సులు, దీవెనలతో ఆయన త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా తారకరత్నకు స్టంట్ వేయడం కుదరలేదు. అలా చేస్తే మళ్లీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే డాక్టర్లు స్టెప్ బై స్టెప్ మోనటరింగ్ చేస్తూ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రెజెంట్ వెంటిలేటర్‌ పై ఉన్నాడు. డాక్టర్స్ గిచ్చినప్పుడు ఒకసారి రెస్పాండ్ అయ్యాడు.. ఆ తర్వాత మళ్లీ రియాక్ట్ అవ్వలేదు. బ్రెయిన్ డ్యామేజ్ ఎంత అయ్యిందనేది తర్వాత తెలుస్తుంది’ అని బాలకృష్ణ తెలిపారు.

అనంతరం జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. “27వ తారీఖు చాలా దురదృష్ట సంఘటన జరిగింది మా కుటుంబంలో. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు అవసరం. డాక్టర్స్ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అన్నయ్య కూడా పోరాడుతున్నారు. త్వరలోనే కోలుకొని ఇదివరకటి లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నాను. ఈ పరిస్థితిలో మాకు సాయం అందించేందుకు వచ్చిన కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ గారికి ధన్యవాదాలు” అని చెప్పారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వడం కోసం నందమూరి ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కూడా తారకరత్నకి మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు.