సాధారణంగా బొప్పాయి పండు తిన్న తర్వాత గింజలను పారేసేస్తారు. కానీ, నిపుణుల ప్రకారం ఆ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పపైన్ వంటి శక్తివంతమైన ఎంజైమ్లతో నిండిన బొప్పాయి గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పేగుల్లోని పురుగులు, హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక, యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలతో శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కాలేయం, మూత్రపిండాలకు రక్షణ
శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో కీలక పాత్ర పోషించే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బొప్పాయి గింజలు ఎంతో ఉపయుక్తం. అధ్యయనాల ప్రకారం ఇవి కాలేయాన్ని శుభ్రపరచి, సిర్రోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అలాగే, నిర్విషీకరణ ప్రక్రియను ప్రోత్సహించడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తాయి.
బొప్పాయి గింజలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. గుండె జబ్బుల నివారణలో ఇవి సహజ ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం బొప్పాయి గింజల్లో ఉండే ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.