ఈ డైట్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

High Fiber Diet : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఊబ‌కాయం, అధిక బ‌రువు వంటి స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధాన‌మే ఈ స‌మస్య‌కు ప్ర‌ధాన కార‌ణం. అయితే ఆరోగ్యంపై అవ‌గాహ‌న రావ‌డంతో చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తున్నారు. అనేక ర‌కాల డైట్ ల‌ను పాటిస్తున్నారు. అయితే ఇలా అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు లో కార్బోహైడ్రేట్స్, హై ఫైబ‌ర్ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల సుల‌భంగా, ఆరోగ్య‌వంతంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండ‌వు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన త‌క్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబ‌ర్ ఉండే ఆహారాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. త‌క్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబ‌ర్ ఉండే ఆహారాల్లో కూర‌గాయ‌లు ఒక‌టి. వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ప్రేగుల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డానికి, శ‌రీరంలో కొవ్వును క‌రిగించ‌డానికి, బ‌రువు త‌గ్గ‌డానికి, కొవ్వు రక్తంలోకి చేర‌కుండా కాపాడ‌డానికి కూర‌గాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. 100గ్రాముల కూర‌గాయ‌ల‌ల్లో కేవ‌లం 3 నుండి 4 గ్రాముల పిండి ప‌దార్థాలు మాత్ర‌మే ఉంటాయి. వీటి నుండి ల‌భించే శ‌క్తి చాలా త‌క్కువ క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని ఉడికించి తీసుకోవ‌డం వల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

అలాగే ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఆకుకూర‌ల‌ల్లో కూడా పిండి ప‌దార్థాలు చాలా త‌క్కువ మోతాదులో ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌క్తి చాలా త‌క్కువ‌గా ల‌భిస్తుంది. వీటిలో ఉండే పీచు ప‌దార్థాలు కొవ్వును క‌రిగించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. రోజూ ఒక ఆకుకూర‌ను వండుకుని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అయితే వీటిని వండుకునేట‌ప్పుడు నూనె, ఉప్పు లేకుండా వండుకుని తిన‌డానికి ప్ర‌య‌త్నించాలి. నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల 900 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే ఉప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి నీరు ప‌డుతుంది.

క‌నుక ఇవి రెండు లేకుండా కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను వండుకుని తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. రోజూ 200 నుండి 250గ్రాము ఆకుకూర‌ను, అలాగే 300 నుండి 400 గ్రాముల కూర‌గాయ‌ల‌ను ఉడికించి తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అలాగే కూర‌గాయ‌ల‌ను కూడా వీలైనంత వ‌ర‌కు తొక్క‌తో తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. లేత కూర‌గాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల తొక్క తీసే అవ‌స‌రం ఉండ‌దు. దీంతో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇలా కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను చ‌ప్ప‌గా వండుకుని మ‌ధ్యాహ్నం పూట ఒక‌టి లేదా రెండు పుల్కాల‌తో తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు ప‌ట్ట‌కుండా ఉంటుంది. మ‌నం సుల‌భంగా, ఆరోగ్యవంతంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.