కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్(92) కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన ఎన్నో అపురూప చిత్రాలను అందించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతైన హిట్లను అందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయన కెరీర్ లో 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కె.విశ్వనాథ్ ఇక లేరని తెలుసుకుని చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

కె.విశ్వనాథ్ 1930, ఫిబ్రవరి 19న జన్మించారు. ఆయన పూర్తిపేరు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన స్వస్థలం రేపల్లె. డిగ్రీ పూర్తి చేసిన ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రమణ్యంతో కలిసి మద్రాసులోని వాహిని సౌండ్ స్టూడియోస్ లో ఉద్యోగానికి వెళ్లారు. సౌండ్ రికార్డిస్ట్ గా విశ్వనాథ్ కెరీర్ ప్రారంభించారు. తర్వాత డైరెక్టర్ గా చేసిన ఆత్మ గౌరవం అనే తొలి సినిమాకే నంది పురస్కారాల్లో.. ఉత్తమ చిత్రం విభాగంలో కాంస్యం సొంతం చేసుకున్నారు. ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా శంకరాభరణం. ఆ సినిమాకి నంది మాత్రమే కాదు..జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ ఒక్క సినిమాకే కాదు.. సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం సినిమాలకు కూడా జాతీయ అవార్డులు దక్కాయి.