గుడివాడలో అరుదైన సర్జరీ.. బాలిక కడుపులో నుంచి ఏకంగా కిలో బరువైన..!

కృష్ణా జిల్లా గుడివాడలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ బాలికను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ బాలిక తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గుతున్న సమస్యతో ఉన్న ఆ బాలికకు వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆ బాలిక కడుపులో నుంచి ఏకంగా కిలో బరువైన వెంట్రుకల ముద్దను వైద్యులు బయటకు తీశారు. అసలు ఆమె కడుపులోకి అన్ని వెంట్రుకలు ఎలా వచ్చాయా అని తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అలా వెంట్రుకలు తినడం ఒక వ్యాధి అని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన బాలిక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను తల్లిదండ్రులు స్థానిక ప్రైవేటు నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లారు.

అప్పటికే ఆమెకు తీవ్రంగా వాంతులు, కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు స్కానింగ్, ఎండోస్కోపీ నిర్వహించారు. ఆ క్రమంలో వారికి ఆమె కడుపులో నల్లగా ఏదో ఉన్నట్లు కనిపించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు వెంటనే ఆమెకు సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఆ బాలికకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ చేసి ఆ బాలిక కడుపులో నుంచి ఒక కిలో బరువైన నల్లని గడ్డను బయటకు తీశారు. తీసిన తర్వాత పరీక్షించగా అది వెంట్రుకల గడ్డ అని తెలిసింది. ఆ బాలిక చిన్న వయసు నుంచే ఆ వెంట్రుకలను తింటూ ఉండటం వల్ల అవి కడుపులో పేరుకుపోయాయి. నిజానికి తక్కువ మొత్తంలో వెంట్రుకలు అయితే అవి బయటకు వచ్చేస్తాయి. కానీ, అవి అంత పెద్ద మొత్తంలో పేరుకోవడంలో బయటకు రావడం కుదరలేదు.

అంతేకాకుండా జీర్ణాశయం మొత్తం వెంట్రుకలు ఉండటంతో ఆమె తిన్న ఆహారం జీర్ణం కాకుండా బయటకు వచ్చేసింది. ఏమీ తినలేకపోవడం వల్ల బరువు తగ్గినట్లు వైద్యులు వెల్లడించారు.ట్రైకోబీజోఆర్ వల్ల చాలామంది చిన్న వయసు నుంచే వెంట్రుకలు తినడం చేస్తుంటారట. ఇది అందరికీ వచ్చే లక్షణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఇది లక్షమందిలో ఒకరికి కనిపించే లక్షణంగా పేర్కొన్నారు. అంతేకాకుండా సర్జరీ చేసి ఒక వ్యక్తి కడుపులో నుంచి కిలో బరువైన వెంట్రుకలు బయటకు తీయడం అనేది వైద్య రంగంలో ఇప్పటి వరకు ఎక్కడా నమోదైన దాఖలాలు లేవని వైద్యులు వెల్లడిస్తున్నారు. అలాగే సర్జరీ సక్సెస్ అయ్యిందని, ఆపరేషన్ తర్వాత ఆ బాలిక పూర్తి ఆరోగ్యంగా మారినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక కోలుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.