పిల్లల్లో నులిపురుగుల సమస్యకు చక్కటి వైద్యం ఇదే.

పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు తిష్ఠవేస్తాయి. వీటిలో ఏలిక పాములు(ఆస్కారిస్‌ లుంబ్రికాయిడ్స్‌), కొంకి పురుగులు(అంకైలోస్టోమాడియోడెనేల్‌), చుట్ట పాములు (టీనియా సోలియం) అనే మూడురకాలుంటాయి. ఈ నులిపురుగులు 55 ఫీట్ల(17 మీటర్ల)దాకా పెరిగి 25 ఏళ్ల దాకా బతుకుతాయి. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి.

అయితే చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు చేతుల ద్వారా నులి పురుగుల లార్వాలు నోటి ద్వారా కడుపులోకి వెళ్తాయి. పేగుల్లో నులిపురుగులుగా మారి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకుంటాయి. దీంతో పిల్లల్లో ఎదుగుదల దెబ్బతింటోంది. లక్షణాలు.. నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం బారిన పడతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

నులి పురుగులు సంక్రమించిన చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్‌ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలము ద్వారా నులి పురుగులు బయటికి పోతాయి.

విటమిన్‌-సీ, జింక్‌ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కలుషితమైన నీళ్లను తాగకూడదు. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు.. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం మానుకోవాలి. ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి. పండ్లు, కూరగాయాలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవాలి. చేతి గోర్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. భోజనానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి.