మోడీ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే మీకు ఫ్రీ కరెంట్.. జన్మలో బిల్లు కట్టక్కర్లేదు.

సహజ వనరుల క్షీణతను నివారించడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టిసారించింది. దీని కింద.. ఇప్పటికే సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్ గురించి ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ మంగళవారం దీనికి పేరు పెట్టారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో ‘పీఎం సూర్య ఘర్’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

పౌరులకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం’ అని ప్రధాన మంత్రి మంగళవారం ప్రకటించారు. “స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం మేము పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నాము,” అని అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో పోస్టు చేశారు. రూ. 75,000 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇళ్లల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా అందజేసే రాయితీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు. “స్టేక్ హోల్డర్లందరూ జాతీయ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏకీకృతం చేయబడతారు, ఇది సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది,” అని ఆయన చెప్పారు. ఈ పథకాన్ని గ్రౌండ్ లెవల్‌లో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను (రూఫ్‌టాప్‌లపై సౌరశక్తి) ప్రోత్సహించేలా ప్రోత్సహిస్తామని ప్రధాని మోడీ చెప్పారు.