వాణీ జయరాం పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు..!

వాణీ జయరాం.. ఆమె పాట పాడితే.. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది.. అలా వింటూ పోతాం. భక్తి, సంగీత, కమర్షియల్‌ ఇలా అన్ని కేటగిరిల పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు వాణీ జయరాం. ఆమె తన కెరిర్లో సుమారు 20 వేల పాటలు పాడి శ్రోతలను అలరించారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన వాణి జయరాం.. రెండు రోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు.

ముందుగా వాణీ జయరాం మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలా మరణించారు అనే విషయం మీద క్లారిటీ లేదు. పైగా ఆమె వయసు కూడా ఎక్కువ కావడంతో.. వృద్ధాప్యం వల్ల చనిపోయి ఉండవచ్చు అని అందరూ భావించారు.అయితే కొద్దిసేపటికే వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మరణించారు అనే విషయం బయటకు వచ్చింది. వాణీ జయరాం నుదుటి భాగంలో గాయాలున్నట్లు ఆమె ఇంట్లో పని చేసే.. పనిమనిషి గుర్తించడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలిపింది.

దాంతో వెంటనే పోలీసులు వాణీ జయరాం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే పోలీసులు మాత్రం పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే తప్ప.. ఏ విషయం తెలియదు అని వెల్లడించారు. ఈ క్రమంలో వాణీ జయరాం పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చింది. దీనిలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.పోస్టుమార్టం రిపోర్టులో వాణీ జయరాం నుదుటి మధ్య భాగంలో ఒక ఇంచు లోతుగా తలకు బలమైన గాయమైనట్లుగా గుర్తించారు.

అయితే ఈ గాయం ఎలా అయ్యింది అనే దాని గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఇక ఇది ప్రిలిమినరీ రిపోర్ట్‌ మాత్రమే అని.. పూర్తి రిపోర్టు వస్తే కానీ ఈ అంశం మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదని పోలీసులు వెల్లడించారు. ఇక వాణీ జయరాం మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించింది. చెన్నైలోని బేసంట్‌నగర్‌ శ్మశాన వాటికలో.. ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వాణీ జయరాం పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతిపై సంతాపం తెలిపారు. మరి వాణీ జయరాం ప్రమాదావశాత్తు మృతి చెందారా.. లేక మరేదైనా కారణమా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.