కే. విశ్వనాథ్ చనిపోతూ చేసిన ఆఖరి పని ఏమిటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కే.విశ్వనాథ్‌ అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో వయోభారంతో విశ్వనాథ్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో తెలుగు ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖులంతా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. స్వాతిముత్యం, శంకరాభరణం, స్వయంకృషి, సిరివెన్నెల లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్‌ ఇకపై లేకపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్‌ భారతీయ సినిమాకు తీరని లోటని ప్రముఖులు పేర్కొంటున్నారు.చివరి క్షణాల్లోనూ సినిమానే శ్వాసించారు..

50 ఏళ్లకు పైగా తెలుగు సినిమాకు శ్రామికుడిలా సేవ చేసిన విశ్వనాథ్‌.. చివరి క్షణాల్లోనూ సినిమానే శ్వాసిస్తూ.. తుది శ్వాస విడిచారు. ఒక పాట రాస్తూనే ఆయన మృత్యుఒడిలోకి జారుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టతలు తీసుకొచ్చిన శంకరాభరణం విడుదైలన రోజు(ఫిబ్రవరి 2) కావడంతో ఉదయం నుంచి ఎంతో ఉత్సాహంగా ఉన్న విశ్వనాథ్‌.. ఆ రోజు ఒక పాట రాసేందుకు పూనుకున్నారు. చేతితో రాసేందుకు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో ఆయన పెద్ద కుమారుడిని పిలిచి.. ఆయన నోటితో చెబుతుంటే.. దానికి అక్షర రూపం ఇవ్వమని కుమారుడిని ఆదేశించారు.రోజంతా ఆ పాటను పూర్తి చేయడంపై మనసు పెట్టిన విశ్వనాథ్‌.. పాట నోటితో చెబుతూనే.. గాఢనిద్రలోకి జారుకున్నారు.

దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో.. పాట రాస్తూనే ఆయన తుది శ్వాస విడిచినట్లు వార్తలు, కథనాలు వెలువడుతున్నాయి. సినిమా కోసమే బతికిన మహా దర్శకుడు చివరికి.. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూనే.. తుది శ్వాస విడిచారంటూ.. ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. తెలుగు సినిమా స్థాయి పెంచిన దర్శకుడిగా కే.విశ్వనాథ్‌ ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మరణం.. తెలుగు సినిమాకే కాక భారతీయ సినిమాకే ఒక పూడ్చలేని లోటు. మరి విశ్వనాథ్‌ ఆయన చివరి క్షణాల్లో పాట రాసేందుకు ప్రయత్నించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.