ప్రీతి మరణానికి కారణం? ప్రీతిది ఆత్మ హత్యా .?హత్యే.?అన్నీ అనుమానాలే!

ఓ సైకో వేధింపులు భరించలేక.. ఆత్మహత్యాయత్నం చేసి.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి అలసిపోయి.. తుది శ్వాస విడిచింది వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి. అయితే ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రీతిది హత్య.. ఆత్మహత్య అనే సందేహాలు వినిపిస్తున్నాయి. వరంగల్‌ జిల్లా కేఎంసీ కాలేజీలో పీజీ చదువుతోన్న మెడికో విద్యార్థిని ప్రీతి .. సీనియర్‌ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక.. ఆత్మహత్యాయత్నం చేసి.. మృతి చెందిన సంగతి తెలిసిందే. సుమారు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి.. 9 గంటల ప్రాంతంలో ప్రీతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్‌ డెడ్‌ కారణంగా ప్రీతి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ప్రీతి మృతిపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రీతి ఎలా మృతి చెందింది.. ఆమె మరణించడానికి కారణం ఏంటి.. పోస్ట్‌ మార్టం రిపోర్టు నివేదికలో ఏ విషయాలు ఉన్నాయనే దాని గురించి ఇంత వరకు క్లారిటీ రాలేదు.

ఈ క్రమంలో ప్రీతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాటికి అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబులు రావడం లేదు. ఇక ప్రీతి మృతి చెందింది అని ప్రకటించిన తర్వాత.. ఆమె కుటుంబ సభ్యులు, విపక్షాలు, ప్రజల నుంచి పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వినిపిస్తున్నది ఏంటంటే.. ప్రీతి చాలా ధైర్యం గల అమ్మాయి అని.. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని మొదటి నుంచి ఆమె బంధువులు, స్నేహితులు అంటున్నారు. ప్రీతి ఇంజెక్షన్‌ తీసుకుని చనిపోయిందని.. దాని కోసం గూగుల్‌లో సర్చ్‌ చేసిందని వైద్యులు, పోలీసులు తెలిపారు. కానీ అసలు ఆమె ఏ ఇంజెక్షన్‌ తీసుకుంది అనే వివరాలను మాత్రం ఇప్పటి వరకు వైద్యులు అధికారికంగా వెల్లడించలేదు. దాంతో ఆమెను హత్య చేసి.. ఆ తర్వాత ఇంజెక్షన్‌ గురించి వెలుగులోకి తీసుకువచ్చారని.. ప్రీతి చనిపోయిన తర్వాత.. నిందుతులే ప్రీతి సెల్‌లో ఇంజెక్షన్‌ గురించి సర్చ్‌ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి పోలీసులు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక ప్రీతికి నిమ్స్‌ ఆస్పత్రిలోనే వైద్యం చేయడంపై కూడా అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీతి ట్రీట్‌మెంట్‌కి నిమ్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో అపోలో, ఎఐజీ, కిమ్స్, యశోదలాంటి ఎన్నో కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో క్రిటికల్ కేర్ బ్యాకప్ బలంగా ఉంది అయినా సరే.. ప్రీతికి నిమ్స్‌లోనే ఎందుకు చికిత్స అందించారు.. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌కి ఎందుకు తీసుకెళ్లలేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రీతి గిరిజన యువతి కాబట్టే.. ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని.. అదే ఆమె ఉన్నత సామాజిక వర్గానికి చెందిన యువతి అయితే ఇలానే చేసేవారా.. అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక.. సైఫ్‌ వేధింపుల గురించి ప్రీతి ఆస్పత్రి యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కానీ హాస్పిటల్ ఇంటర్నల్ బాడీస్‌, లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు గానీ ఎందుకు పట్టించుకోలేదు.. ఉన్నత విద్య అందించే కాలేజీలు, యూనివర్శిటీల్లో అసలు ఇలాంటి కమిటీలు ఉనికిలో ఉన్నాయా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.

ప్రీతి తండ్రి స్వయంగా ఓ పోలీసు అధికారి. కుమార్తె వేధింపులు గురించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కానీ వారు సకాలంలో స్పందించలేదు అనే వార్తలు వినిపస్తున్నాయి. అంతేకాక నిందితుడు సైఫ్‌కు అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాల కారణంగానే పోలీసులు ప్రీతి ఇచ్చి ఫిర్యాదుపై స్పందించలేదు అంటున్నారు. పోలీసులు ఈ కేసు విషయంలో ఎందకు ఇంత ఇంత ఉదాసీనంగా ఉన్నారు.. ఈ వ్యవస్థలు ఎందుకు ఇంత బలహీనంగా మారాయి అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక బలహీనంగా ఉండే విద్యార్థులకు ఎందుకు సైకియాట్రిక్‌ సపోర్ట్‌ ఎందుకు లేదు? కాలేజీల నిర్వహణ తీరుపై డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఎందుకు కొరవడింది అని ప్రశ్నిస్తున్నారు. ప్రీతి మృతి చెందింది అని వైద్యులు వెల్లడించిన తర్వాత.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపడానికి ప్రీతి తల్లిదండ్రులు నిరాకరించారు. అసలు తమ కుమార్తె ఎందుకు చనిపోయిందో సరైన కారణాలు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సైఫే తమ బిడ్డకు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు.

అంతేకాక ఫిబ్రవరి 22వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు అసలు ఏం జరిగిందో తమకు తెలియజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతేకాక సైఫ్‌తో పాటు మరికొందరు సీనియర్లు కూడా ప్రీతిని వేధించారని ఆమె తల్లితో చెప్పుకుంది. వాట్సాప్‌ చాట్‌లో ఈ విషయం బహిర్గతం అయ్యింది.. అయినా సరే మిగతా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక తన కుమార్తె ఫిర్యాదుపై వెంటనే స్పందించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌, హెచ్‌ఓడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. సైఫ్‌కు ఉరిశిక్ష విధించాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక గురించి ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.. దీనిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రీతి ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేసి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మరి ఈ అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా లేవా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.