ఇంట్లో ఎవ్వరు పూజ చెయ్యాలి…

ఇంట్లో సాధారణంగా రోజు వారి పూజ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది నిత్య పూజ చేస్తూ ఉంటారు మరి కొంతమంది గురు, శుక్ర ,శని మొదలగు ప్రత్యేకమైన వారాలలో పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో పూజ అనేది ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది? పూజ అనేది వారంలో ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది, ప్రతిరోజు మన ఇంట్లో ఒక దీపం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసుకోవడానికి సమయం లేని సందర్భంలో కనీసం ఒక అగర్బత్తిని అయినా సరే వెలిగించి ఒక స్తుతిని చెప్పుకోవడానికైనా సమయం ఉంటుంది కదా ఇది తప్పనిసరిగా ప్రతిరోజు చేయాల్సిందే. మనం పూజ ఎందుకు చేస్తామంటే మనకి ఏమైనా కావాలి అని చేయడం అనే మాట పక్కన పెడితే మనకి ఇవన్నీ ఇచ్చినందుకు చేయాలి.

మనకి శరీరం ఇచ్చాడు, శరీరంలో అన్ని అవయవాలను అవి పని చేసే విధంగా మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు మనకు మన శరీర భాగంలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మన మనుగడ అనేది సరిగా ఉండదు, ఇవన్నీ కూడా మనకు భగవంతుడు ఇచ్చినందుకు ఒక్కసారి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ప్రత్యేకమైన పూజలు ఏరోజు చేసినా సరే కానీ ప్రతిరోజు కూడా కనీసం స్నానం చేసి అగర్బత్తి వెలిగించి ఒక స్తోత్రం పఠించి దండం పెట్టుకోవడం అనేది చాలా మంచి అలవాటు ఇది ప్రతినిత్యం చేస్తూనే ఉండాలి. అయితే ఈ పూజ అనేది ఎవరు చేయాలి అనేది మన శాస్త్రాలు మనకు స్పష్టంగా చెప్పాయి. మనం సంకల్పం చెప్పుకునేటట్టు చెప్పుకునేటప్పుడు మామూలుగా ఏదైనా పేరు చెప్తాం, తర్వాత ధర్మపత్ని సమేతస్య, సహ కుటుంబ నామ్ చెప్పుకుంటాం. అంటే ఎవరు పూజ చేస్తున్నట్లు ఆ ఇంటి యజమాని.

యజమాని అనే పదానికి కూడా అర్థం ఏమిటంటే పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవారు యజ్ఞం చేయడానికి అక్కడ ఎవరైతే కూర్చుంటారో వారు యజమాని, మిగిలిన వారు అందరూ కూడా వాటికి కావాల్సిన సామాగ్రిని అమరుస్తారు, ఇలా కుటుంబం అంతా కూడా సహకరించి కేవలం ఒకరు మాత్రమే యజ్ఞం చేసినట్లయితే ఫలితం అనేది అందరికీ వస్తుంది. అందుచేత ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్లు పూజ చేస్తే చాలు, దాని ఫలితం అనేది ఇంటిల్లిపాదికి వస్తుంది ఎందుకంటే ఆ సంకల్పంలో ధర్మపత్ని సమేతస్య, ఆవిడ పక్కన ఉండవచ్చు లేకపోవచ్చు లేదా పూజ అంతా అయిపోయే సమయానికి నైవేద్యం తీసుకువచ్చి అక్కడ పెడుతుంది కదా అది చాలు అది కూడా పూజలో భాగమే.

లేదంటే అక్కడ యజమాని పూజ చేస్తుంటే పిల్లలు వెళ్లి వాటి కావాల్సిన సామాగ్రి పూలు తేవడం లాంటిది చేస్తూ ఉంటారు కదా వాళ్లు కూడా అందులో భాగస్వామ్యం అయినట్లే కదా అందుచేత అందరూ కూర్చొని చేయాలని లేదు నిజానికి ఒక ఇంట్లో ఒక దేవుడి మందిరం ఒక్కపొయ్యి మాత్రమే ఉండాలి అని చెప్తారు. ఒక పొయ్యి అంటే ఎన్ని స్టవ్లు ఎన్ని బర్నర్లు అనేది లెక్క కాదు ఒక వంటిల్లు అని అర్థం. ఒకవేళ ఇంటి యజమాని చేయడానికి వీలులేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా చేయవచ్చు అప్పుడు కూడా ఒక్కరే చేస్తే సరిపోతుంది ఇలా కూడా ఫలితం అనేది ఇంట్లో ఉన్న వారందరికీ వస్తుంది. అక్కడ వెలిగించిన దీపం దగ్గర మిగిలిన ఇంటి సభ్యులు వెళ్లి నమస్కారం చేసుకుని ఒక స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది, ఒకవేళ దీపం కొండెక్కుతుంది అని అనుమానం వస్తే దాంట్లో కొద్దిగా నూనె పోయండి, కానీ మరొక దీపం మాత్రం వేరే పెట్టకూడదు.