బ్రేకింగ్‌:ప్రముఖ నటుడు కైకాల సత్యానారాయణ మృతి!

టాలీవుడ్‌లో.. ఈ ఏడాది పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీనియర్‌ హీరోలు కృష్ణంరాజు, కృష్ణ కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. టాలీవుడ్‌లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు కైకాల సత్యానారాయణ.. శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కైకాల మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. టాలీవుడ్‌లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.

కైకాల మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కైకాల సత్యనారాయణ.. 1935, జూలై 25న కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో జన్మించారు. గుడివాడ కాలేజీలో గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. ఊహా తెలిసినప్పటి నుంచి ఆయనకు నటన అంటే ఎంతో ఇష్టం. దాంతో కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిర్మాత డీఎల్‌ నారాయణ.. కైకాలలో ఉన్న ప్రతిభను గుర్తించి.. ఆయనకు సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా సత్యనారాయణ.. తొలిసారి సిపాయి కూతురు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆతర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.

తన సినీ కెరీర్‌లో కైకాల మొత్తం.. 700 పైగా చిత్రాలో నటించారు. తొలుత విలన్‌ పాత్రల్లో మెప్పించినప్పటికి.. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. అద్భుతమైన నటనతో.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. నవరస నటనా సర్వభౌమ బిరుదు అందుకున్నారు కైకాల. ఇయన ఆయన తన సినీ కెరీర్‌లో.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు. ఇక యమలీల చిత్రంలో యముడి పాత్రలో అద్భుతంగా నటించి.. నిజంగా యముడు ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా ప్రజల మనసులో నిలిచిపోయారు. 1994లో బంగారు కుటుంబం సినిమాలో నటనకుగాను ఆయన నంది అవార్డు గెలుచుకున్నారు. అలానే 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 2017లో కైకాలకు ఫిల్మ్‌ ఫెయిర్‌ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.

కైకాల తన సినీ కెరీర్‌లో మొత్తం 200 మందికి పైగా దర్శకులతో పని చేశారు. కైకాల నటించిన చిత్రాల్లో.. 220 పైచిలుకు చిత్రాలు.. ఏకంగా 100 రోజలుకు పైగా ఆడాయి. 59 సినిమాలు అర్థ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలైతే ఏకంగా ఏడాది పాటు నడిచాయి. కైకాల రాజకీయాల్లో కూడా రాణించాడు. 1996లో మచిలీపట్నం నుంచి గెలిచారు. కైకాలకు సంబంధించి మరో ఆసక‍్తికర విషయం ఏంటంటే.. సీనియర్‌ నటులు ఎన్టీఆర్‌, ఏన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులతో పాటుగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌.. మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి ఈ తరం హీరోలతో కూడా ఆయన స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఏళ్ల పాటు తన అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను అలరించిన కైకాల..

వయోభారం కారణంగా గత కొంత కాలం నుంచి సినిమాలకూ దూరంగా ఉంటున్నారు. చివరగా కైకాల బర్త్ డేను.. మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా సెలెబ్రేట్ చేశారు. కైకాల ఇంటికి వెళ్లి మరీ చిరంజీవి.. ఆయన చేత కేక్ కట్ చేయించాడు. చిరు తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేయడంతో కైకాల ఎంతో సంతోషించారు. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరలయ్యింది. ఇక ఈ ఏడాది టాలీవుడ్‌లో ఒకదాని తరువాత ఒకటిగా వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు, తాజాగా సూపర్‌ స్టార్ కృష్ణ మృతి చెందగా.. ఇప్పుడు ఇలా కైకాల మరణంతో ఇండస్ట్రీలో మరింత విషాదం నెలకొంది.