మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి అస్వస్థత

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న మంత్రి మల్లారెడ్డి, ఆయన తనయుడు, అల్లుడు ఇంట్లో, కార్యాలయాలు, మెడికల్ కాలేజీల్లో ఐటీ దాడులు నిర్వహించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డికి తీవ్రంగా ఛాతిలో నొప్పి రావడంతో సూరారం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఐటీ దాడులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయనకు అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజాము నుంచి కేంద్ర పోలీసులు బలగాల వలయంలో పలు చోట్ల మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 50 బృందాలు పాల్గొన్నట్లు సమాచారం. మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి కాలేజీలకు డైరెక్టర్ గా కొనసాగుతూనే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. అంతే కాదు ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాడుల్లో రూ. కోట్లలో నగదు తో పాటు గా పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మంగళవారం ఉదంయ నుంచి మంత్రి మల్లారెడ్డి తో పాటు ఆయన బంధువుల నివాసాల్లో దాదాపు 46 ప్రాంతాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో కొంపల్లి లో ఉంటున్న మహేందర్ రెడ్డి ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించారు. మరో కుమారుడు భద్రారెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న రాత్రి పలు చోట్ల తాత్కాలిక సోదాలు నిలిపి వేశారు అధికారులు. బుధవారం ఉదయం తిరిగి సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో ఆయను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తెలంగాణలో  ఐటీ దాడుల విషయం హాట్ టాపిక్ గా మారింది.