బ్రేకింగ్: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు!

ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు నేతలు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పలువురు నేతల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2018 లో టీఆర్ఎస్ పార్టీ తరుపు నుంచి మేడ్చల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 సీఎం కేసీఆర్  మంత్రి వర్గంలో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంటారు మంత్రి మల్లారెడ్డి. తాజాగా హైదరాబాద్ లో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

బోయన్ పల్లి, మేడ్చల్, మల్కాజ్ గిరి పరిధిలోని మల్లారెడ్డి తో పాటు కొంపల్లిలో ఆయన తనయుడు మహేందర్ రెడ్డి, అల్లుడు ఇళ్లల్లో ఏక కాలంలో ఐటీ అధికారాలు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి సుమారు 50 మంది ఐటీ అధికారుల బృందం ఐటీ సోదాలో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.