మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్‌.. భయపడే ప్రసక్తే లేదన్న మంత్రి తలసాని …

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన ఇళ్లతో పాటు కాలేజీలు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ దాడులను తప్పు బట్టారు. కేంద్రం తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వారు చర్చించారు.

సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని మాట్లాడుతూ.. ‘‘ ఐటీ దాడుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందే చెప్పారు. ఈ దేశంలో డెమోక్రసీ ఎక్కడికి పోతోందో తెలిసే ‍ప్రశస్తిలేదు. టార్గెటెడ్‌గా జరుగుతున్న అంశాలు మీరు చూస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక తమపై దాడులు చేస్తున్నారు. కేంద్రం దాడులకు భయపడే ప్రసక్తే లేదు. దేశ చరిత్రలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. ఎవ్వరికో భయపడాల్సిన అవసరం.. టీఆర్‌ఎస్‌ పార్టీకి గానీ, పార్టీ నాయకత్వానికి గానీ లేదు. కచ్చితంగా ఎదుర్కొంటాం. ప్రజాక్షేతంలోకి తీసుకుపోతాం.

అవసరం అయితే, ప్రజలనే చైతన్యం చేసి ఏం జరుగుతుందో చూపిస్తాం. వ్యవస్థ ఈరోజు మీ చేతులో ఉంటది. రేపు మా చేతులో ఉంటది’’ అని అన్నారు.  కాగా, బోయన్ పల్లి, మేడ్చల్, మల్కాజ్ గిరి పరిధిలోని మల్లారెడ్డి ఇళ్లతో పాటు కొంపల్లిలోని ఆయన తనయుడు మహేందర్ రెడ్డి, అల్లుడు ఇళ్లల్లో కూడా ఏక కాలంలో ఐటీ అధికారాలు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి సుమారు 50 మంది ఐటీ అధికారుల బృందం ఐటీ సోదాలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.