మహానటి సావిత్రి ఇల్లు కొనడానికి కారణం అదే: లలితా జ్యువెల్లరీ ఎండీ

‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వ్యాపారవేత్త లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకించి ఏవీలు, ఎలివేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఆయనే స్పెషల్ ఏవీ వేసుకున్నారు, ఆయన గురించి ఆయన ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చుకున్నారు. సెలబ్రిటీలకు కోట్లు ఖర్చు పెట్టి ఆ భారాన్ని ప్రజల మీద వేయడం కంటే.. ఆ కోట్లను ప్రజలకే ఆభరణాల రూపంలో తగ్గించి ఇస్తే బాగుంటుంది కదా ఆలోచించి.. ఒక విప్లవాత్మక వ్యాపారవేత్తగా ఎదిగారు. అయితే ఆయన ఇవాళ ఇంతటి సక్సెస్ అనుభవించడానికి.. ఇన్ని కోట్లకు అధిపతి అవ్వడానికి కారణం మహానటి సావిత్రి అని ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సావిత్రి కూతురు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించగా.. మరో ఇంటర్వ్యూలో కిరణ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మహానటి సావిత్రి ఇంటితో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఎంతో ఇష్టంతో సావిత్రి బిల్డింగ్ ని కొన్నానని కిరణ్ కుమార్ తెలిపారు. సావిత్రి పేరు మీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ లో లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్ అద్దెకు ఉండేవారు. ఆ బిల్డింగ్ ని అమ్మాలని సావిత్రి కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు.. తనకు బాగా కలిసి వచ్చిందని.. సెంటిమెంట్ గా ఉంటుందని భావించి ఆ బిల్డింగ్ ని కిరణ్ కుమార్ కొన్నారు. ఇక కిరణ్ కుమార్ కి అమ్మడం వెనుక కూడా ప్రత్యేకమైన కారణం ఉందని  సావిత్రి కూతురు వెల్లడించారు.

తమ తల్లి సావిత్రికి బంగారం అంటే పిచ్చని.. ఇక కిరణ్ కుమార్ ది బంగారం షాప్ అని.. అలానే అమ్మకి కార్లంటే పిచ్చి అని.. ఆ పిచ్చి కిరణ్ కుమార్ కి కూడా ఉందని.. తమను తమ్ముడిగా భావించమని అంటారని.. అక్క అని ఆప్యాయంగా పిలుస్తారని.. ఆ సెంటిమెంట్ తోనే ఆ ఇల్లు ఆయనకు విక్రయించామని అన్నారు. సావిత్రి ఇంట్లో ఉండబట్టే తాను ఇంత సక్సెస్ అయ్యానని కిరణ్ కుమార్ కూడా వెల్లడించారు. ఇల్లు అమ్మినప్పుడు సావిత్రి కూతురు సావిత్రి ఫోటోని తీసుకెళ్తుంటే.. మీరు ఏమైనా చేయండి గానీ ఆమె ఫోటో మాత్రం తీసుకోవద్దమ్మా అని అన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. తన వద్ద 40 కార్లు ఉన్నాయని, ప్రస్తుతం సావిత్రి ఇంట్లోనే ఉన్నాయని అన్నారు.

ఇప్పటి వరకూ తాను కొన్న ఏ కారు అమ్మలేదని.. అయితే ఒకప్పుడు కంటే ఇప్పుడు కార్ల మీద మోజు లేదని కిరణ్ కుమార్ వెల్లడించారు. అద్దెకు ఉన్నప్పుడు వ్యాపారం బాగా కలిసి వచ్చిందని, అమ్మ ఆశీర్వాదం వల్ల అంతా బాగా జరిగిందని.. అందుకే ఆ ఇంటిని సెంటిమెంట్ గా కొన్నానని అన్నారు. అమ్మ పేరుని అందుకే మార్చలేదని.. లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశాము గానీ.. సావిత్రి గణేశన్ పేరు అలానే ఉంచామని అన్నారు. బంగారం, కార్లు అంటే విపరీతమైన పిచ్చి ఉన్న మహానటికి తగ్గట్టు.. ఆ ఇంట్లో బంగారం వ్యాపారం చేసే వ్యక్తి ఉండడం.. ఆ వ్యక్తికి కూడా సావిత్రి లానే కార్లు అంటే మోజు ఉండడం.. చూస్తుంటే ఇది యాదృచ్చికంగా జరిగిందనుకోవాలా? దైవ నిర్ణయం అనుకోవాలా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.