రుచి విషయంలో రాజీపడకుండా ఆరోగ్యాన్ని కాపాడే మార్గం.!

ఆహారంలో ఉప్పు మోతాదు మించితే అనర్థదాయకమని తెలిసినా రుచి కోసం దాన్ని తగ్గించుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఫలితంగా అధికరక్తపోటు బారిన పడుతుంటారు. అయితే, రుచి విషయంలో రాజీపడకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని, సాధారణ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ఇతర పదార్థాలను వాడితే అధిక రక్తపోటు ముప్పు తగ్గుతుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సోడియం క్లోరైడ్‌కు ప్రత్యామ్నాయాలను వాడితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నదానిపై బీజింగ్‌లోని పెకింగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

ఇందుకోసం 55 ఏళ్లు పైబడ్డ 611 మందిని ఎంచుకున్నారు. వారిలో కొందరికి సాధారణ ఉప్పు స్థానంలో ప్రత్యామ్నాయాన్ని ఇచ్చారు. మిగతావారికి సోడియం క్లోరైడ్‌ను కొనసాగించారు. ఆరంభంలో వీరి రక్తపోటు 140/90 కన్నా తక్కువగా ఉంది. బీపీ నియంత్రణకు ఎవరూ మందులు వాడటంలేదు. రెండేళ్ల తర్వాత పరీక్షా రికార్థులను శాస్త్రవేత్తలు పరీక్షించారు. సాధారణ ఉప్పును వాడేవారితో పోలిస్తే ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించినవారు అధిక రక్తపోటు బారినపడే అవకాశం 40 శాతం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

వారు ‘లో బీపీ’ ముప్పునూ తగ్గించుకోవచ్చని తేలింది. టాషియం సాల్ట్‌ అంటే పొటాషియం క్లోరైడ్‌ను సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. రుచిపరంగా ఇది చాలావరకూ సోడియంను పోలి ఉంటుంది. అయితే మూత్రపిండాల రుగ్మతలు, ఇతర వ్యాధులు ఉన్నవారు వైద్య సలహా తీసుకున్న తర్వాతే దీన్ని వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన కొన్ని ప్రత్యామ్నాయాలనూ డైటీషియన్లు సూచిస్తున్నారు. వెల్లుల్లి, అల్లం, నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, ఎండబెట్టిన ఉల్లి, న్యూట్రిషనల్‌ ఈస్ట్‌ వంటివి ఉప్పుకు ప్రత్యామ్నాయాలుగా వాడవచ్చు.