వాహనదారులకు అలెర్ట్! ఆ వాహనాలను రద్దు చేస్తామంటూ కేంద్ర మంత్రి ప్రకటన ..!

ఈ వార్త ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే..? కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లగ్జరీ వాహనాల్లో రయ్.. రయ్.. అని తిరుగుతుంటే మరికొందరు మాత్రం పాత బడ్డ వాహనాలతో కాలం వెల్లదీస్తుంటారు. ఏదైనా అత్యవసర పని మీద బయలుదేరినపుడు.. అక్కడకి చేరుకుంటామో.. లేదో.. అన్నది వారికి అనుమానమే. అయినప్పటికీ గత్యంతరం లేక అలానే ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే.. ఇకపై వారు అలాంటి భాధలు పడక్కర్లేదు. 15 ఏళ్ల నాటి ప్రభుత్వ వాహనాలను రద్దు చేస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు.

కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం, ఈ ఏడాది ప్రారంభంలో వాహనాల స్క్రాపేజ్ విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత, అన్ ఫిట్ వాహనాలను తొలగించడమే ఈ పాలసీ లక్ష్యం. వాహనాల రిజిస్ట్రేషన్ పరిమితికాలం పూర్తి కాగానే స్క్రాపేజ్‌ పాలసీ అమలులోకి వచ్చేస్తుంది. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం వాణిజ్య వాహనాలు 15 సంవత్సరాల తర్వాత, ప్రైవేట్ వాహనాలు 20 సంవత్సరాల వరకు పరిమితి ఉంటుంది. ఈ టైమ్ తర్వాత వాహనాలు వాతావరణ కాలుష్యానికి, ప్రమాదాలకు దారి తీస్తాయి. అందుకే ప్రభుత్వం ఈ పాలసీ తీసుకొచ్చింది. కాగా, ఈ విధానం ప్రకటించకముందే దేశ రాజధానిలో 15 ఏళ్ల పెట్రోల్, 10 ఏళ్ల డీజిల్ వాహనాలను నడపడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది.

ఈ పాలసీ అమలును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వ వాహనాల నుంచే మొదలుపెట్టారు. 15 ఏళ్ల నాటి ప్రభుత్వ వాహనాలను రద్దు చేస్తామని ప్రకటన చేశారు. ఈ మేరకు విధి విధానాలను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు తెలిపారు. హర్యానాలో కొత్త రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌వీఎస్‌ఎఫ్) ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేసారు. ఇదిలా ఉండగా.. ప్రధాని ‘నరేంద్ర మోడీ’ ఆగస్టు 2021లో ‘వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్’ అనే ఆటోమోటివ్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ప్రకారం.. తమ సొంత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేసే యజమానులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. అలాతే కొత్త కారుపై రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కూడా ఇస్తుంది.