హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.

ఒకవైపు చదువులనీ.. కెరీర్ లనీ… ఉన్నత పదవులనీ… ఇలా ర్యాట్ రేస్ లో పరుగులు. మరోవైపు సరైన తిండి తినడానికి కూడా టైం లేకపోవడం, రెడీ టు ఈట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. ఇంకొకవైపు శరీరాన్ని కదిలించే అవసరం లేని ఉద్యోగాలు. అన్నీ మూకుమ్మడిగా దాడి చేసి మన ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ, కాలేజీలో నడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన యువకుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారే గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు. ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది,

కాబట్టి గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలపై అవగాహన పెంచుకుంటే ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయితే హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి అధిక రక్తపోటు వల్ల కలిగేవి, అరిథ్మియా, హృదయ ధమణి వ్యాధి ఇలా రకరకాలుగా రక్తనాళాల్లో ఇబ్బందులను కలుగ చేసే జబ్బులు ఉన్నాయి. ఏదేమైనా చివరకు జరిగేది గుండెపోటు రావడమే. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కనిపించే లక్షణాలు.. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. శ్వాస సరిగా ఆడదు. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. అలాగే మానసిక ఆందోళన, ఏదో వినాశనం జరగబోతుంది అంటూ వచ్చే ఆలోచనలు, గుండె దడ, శ్వాస సరిగా ఆడక పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన లక్షణాలు. ఇక్కడ చెప్పినవన్నీ రోజుల్లో కాసేపు వచ్చి పోతుండటంతో ఎక్కువమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇవి కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు కనిపించినా కూడా గుండె వైద్యులను కలిసి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం.