అమ్మవారి గుడిలోంచి గాజుల, గజ్జెల శబ్ధాలు.. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు..

సైన్స్‌కి అందని అతీత శక్తి ఏదైనా ఉందంటే అది భగవంతుడు మాత్రమే. భగవంతుడు అందరికీ కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం కనిపిస్తాడని, వినిపిస్తాడని తమకెదురైన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. దేవుడు, దేవతలు ఒక ఎత్తు అయితే.. గ్రామ దేవతలు మరొక ఎత్తు. గ్రామ దేవతలు ఊరి పొలిమేర్లలో కాపలా కాస్తూ ఉంటారని హిందువుల విశ్వాసం. గ్రామ దేవత వీధుల్లో సంచరించే సమయంలో పట్టీల శబ్ధం వినిపిస్తుందని కొందరు అంటూ ఉంటారు. ఇప్పటికీ ఈ అనుభూతిని పొందేవారు ఉన్నారు.

తాజాగా ఇలాంటి అనుభూతి ఒకటి పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం పట్టణంలోని నాయుడు వీధిలో ఉన్న ఇప్పల పోలమ్మ ఆలయంలో నుంచి గాజులు, గజ్జెల శబ్ధం వినిపించిందని భక్తులు చెబుతున్నారు. అంతేకాదు పసుపు ధూపం వేసినట్లు వాసన వచ్చిందని అంటున్నారు. ఇది బాగా ప్రచారం అవ్వడంతో.. అమ్మవారే ఈ శబ్ధాలు చేస్తుందని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. సోమవారం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలయం తలుపులు మూసివేశారు. అయితే అటుగా వెళ్తున్న కొంతమందికి ఆలయంలోంచి గజ్జెల శబ్ధం వినిపించిందని అన్నారు. ఇది అమ్మ మహిమే అని భావించి విషయాన్ని పూజారికి చెప్పారు.

పూజారి వచ్చేలోపే ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆలయం తలుపులు మూసి ఉండడంతో తలుపులకు చెవులు ఆనించి శబ్ధాలను వింటున్నారు. 2008లో ఈ ఆలయాన్ని నిర్మించారని.. ఉత్సవాల సమయంలో అమ్మవారు భక్తుల మీద వాలతారని పూజారి అన్నారు. గుడిలోంచి గాజులు, గజ్జెల చప్పుడు, పసుపు ధూపం వేసిన వాసన వచ్చినట్టు తనతో భక్తులు చెప్పినట్టు వెల్లడించారు. పండుగల సమయంలో రాత్రి సమయంలో అమ్మవారు శబ్ధాలు చేయడం సహజమే అని అన్నారు.