ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఒమిక్రాన్… బ‌య‌ట‌ప‌డ్డ రెండు కేసులు..అన్ని రాష్ట్రాలకు హైఅలెర్ట్ ప్రకటించిన కేంద్రం

Omicron: ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని అంద‌రు అనుకున్నామో, అదే జ‌రిగింది. ఒమిక్రాన్‌ డేంజరస్‌ వైరస్‌ భారత్‌లోను ప్రవేశించింది. తాజాగా.. రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ఒమిక్రాన్‌ కంటిమీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే.2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారికంగా ప్రకటించింది. 46, 66 ఏళ్లు ఉన్న వ్యక్తులకు ఈ వేరియంట్ సోకిందని, ఇటీవలే విదేశాల నుంచి వీరు బెంగళూరుకు వచ్చారని, ప్రైమరీ కాంటాక్ట్స్ క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపింది.కొద్ది రోజుల వ్యవధిలో 20కి పైగా దేశాలకు వ్యాపించింది.

ఇప్పటి వరకు 29 దేశాల్లో 373 ఒమిక్రాన్ కేసులున్నట్లు నిర్ధారించారు. ఈ విషయంలో ప్రతొక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుందని తెలిపింది.ఒమిక్రాన్‌ భయాలతో భారత్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వేరియంట్ తో భారత్ తో సహా..ప్రపంచ దేశాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, మహారాష్ట్రలలో 55 శాతం కరోనా కేసులు ఉన్నాయని, ప్రజల నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.18 జిల్లాల్లో 05 నుంచి 10 శాతం కరోనా పాజిటివ్, కేరళ, మహారాష్ట్రలో పది వేలకు పైగా కరోనా కేసులున్నాయని వెల్లడించింది. ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రెండో డోసు వ్యాక్సినేషన్ 11.7 శాతం పెరిగిందని అంచనా వేసింది. మరోవైపు..ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది.