ఈ ఏడాది సంక్రాంతిని ఏ రోజు జరుపుకోవాలి? జనవరి 14? జనవరి 15?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ అప్పుడే వెల్లివిరుస్తోంది. పల్లెల్లో అప్పుడే పండగ వాతావరణం కనిపిస్తోంది. మకర సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతి తేదీల్లో మాత్రం ఒకింత గందరగోళం నెలకొంది. పండగను జనవరి 14న జరుపుకోవాలా? లేక జనవరి 15న జరుపుకోవాలా? అనే సందిగ్ధతలో ఉన్నారు. అయితే మరి పంచాంగం ప్రకారం పండగ ఏ రోజు జరుపుకోవాలో చూద్దాం.

ఈ సంవత్సరం సంక్రాంతి జరుపుకునే విషయంలో కొన్ని సందేహాలు ఉన్న విషయం తెలిసిందే. కొందరు జనవరి 14న పండగ అని చెబుతుంటే.. ఇంకొందరు కాదు జనవరి 15న సంక్రాంతి అని చెబుతున్నారు. ఈ ఏడాది మకర సంక్రమణం రాత్రిపూట జరగడమే ఈ కన్ఫూజన్ రావడానికి ముఖ్య కారణం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఆ రోజే సంక్రాంతిని జరుపుకుటారు. అయితే అది రాత్రి కావడంతో పెద్ద సమస్యే వచ్చి పడింది.

సూర్యుడు మకర రాశిలో సంచరించిన రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది జనవరి 14వ తారీఖు శనివారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. సంక్రాంతికి స్నానాలు, దానాలు చేస్తుంటారు. మరి మకర సంక్రమణం రాత్రిపూట జరుగుతోంది కాబట్టి.. రాత్రులు అలాంటివి చేయకూడదు. అయితే ఈ ఏడాది సంక్రాంతిని 15వ తారీఖు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అంటే ఈ ఏడాది ఆదివారం మకర సంక్రాంతి అనమాట.