ఒడిశా రైలు ప్రమాదానికి కారణం అదేనా? వారి నిర్లక్ష్యం ఖరీదు వందలాది ప్రాణాలు!

భారతీయ రైల్వే చరిత్రలో మరో అతిపెద్ద రైల్వే ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలో మాటలకు అందని మహా విషాదం జరిగింది. బాలేశ్వర్​కు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైల్వే ప్రమాదంలో 233 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రమాదం రాత్రిపూట జరగడంతో బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది ప్రయాణికులు చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. 2004 తర్వాత మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు.ఒడిశా రైలు ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది వెస్ట్ బెంగాల్​ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో 70 మంది తెలుగు ప్రయాణికులు చిక్కుకున్నట్లు తెలిసింది. వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చాయని.. అందుకే యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. వారి నిర్లక్ష్యం ఖరీదు వందలాది ప్రాణాలు అని పలువురు సీరియస్ అవుతున్నారు. బహనాగ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు లూప్ లైన్​లో ఆగి ఉంది. అయితే వెనుక నుంచి వచ్చిన కోరమాండల్ ఎక్స్​ప్రెస్​కు ఆ స్టేషన్​లో స్టాప్ లేకపోవడంతో మెయిన్ లైన్ ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కానీ కోరమాండల్​కు అధికారులు లూప్​లైన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.ఆ సిగ్నల్ ఇవ్వడం వల్లే మెయిన్ లైన్​లో వెళ్లాల్సిన కోరమాండల్..

లూప్​లైన్​లో ఆగి ఉన్న గూడ్స్​ను 128 కిలో మీటర్ల వేగంతో ఢీకొట్టిందని సమాచారం. అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్​లోని హావ్​డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్​డా ఎక్స్​ప్రెస్ బాలేశ్వర్​కు దగ్గర్లోని బహానగా దగ్గర శుక్రవారం రాత్రి 7 గంటల టైమ్​లో తొలుత పట్టాలు తప్పింది. దీంతో దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్​పై పడిపోయాయి. ఆ బోగీలను షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టింది. బెంగళూరు ఎక్స్​ప్రెస్​ను ఢీకొట్టడంతో కోరమాండల్​ ఎక్స్​ప్రెస్​కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. కోరమాండల్​ కోచ్​లను పక్కన ఉన్న ట్రాక్​ పైకి దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఏదేమైనా ఈ ఘోర ప్రమాదం అధికారుల తప్పిదం వల్లే జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై రైల్వే శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.