భోగి రోజున పిల్లల నెత్తి మీద రేగి పండ్లను ఎందుకు పోస్తారో తెలుసా?

భోగి పండుగ అంటే పెద్దలతో పాటు పిల్లలకి కూడా ఎంతో ఇష్టమైన పండుగ. తెల్లవారుజామునే లేచి భోగి స్నానాలు చేసి.. కొత్త బట్టలు కట్టుకుని అందంగా ముస్తాబవుతారు. అయితే ఇంట్లో అయిదేళ్ల లోపు పిల్లలు ఉంటే వారి తల మీద రేగి పండ్లను వేస్తారు. వీటినే భోగి పండ్లు అని కూడా అంటారు. ఇలా తల మీద రేగి పండ్లు వేయడం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు. శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వీకులు శాస్త్రీయ కోణాన్ని సాంప్రదాయానికి ముడిపెట్టి ఒక ఆచారంగా అలవాటు చేశారు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అదే. ప్రతీ ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. ఉదాహరణకి చెరువుల్లో రాగి నాణాలు వేయడం. ఇప్పుడంటే కాపర్ వాటర్, ఫిల్టర్ వాటర్ అని తాగుతున్నాం గానీ ఒకప్పుడు చెరువు నీళ్ళే తాగేవారు. చెరువు నీరు శుద్ధి అవ్వడం కోసం రాగి నాణాలను చెరువులో వేసేవారు. మామూలుగా నీరు శుద్ధి అవుతుంది, నాణాలు వేయండి అని చెబితే ఎవరూ వినరు గనుక.. వేస్తే దేవుడు కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పారు.

ఇలా ప్రతీ ఆచారాన్ని దేవుడు అనే సృష్టికర్తకి ముడిపెట్టి.. మనుషుల్ని సన్మార్గంలో నడిపించేవారు. అలానే భోగి పండ్లు కూడా పిల్లల తల మీద వేస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటుందని చెబుతారు. అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యం వేరే ఉంది. రేగు చెట్టుని సంస్కృతంలో బదరీ వృక్షం అంటారు. ఈ రేగి చెట్లు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ ప్రతి రూపం అని అంటారు. సూర్యుడికి ఇష్టమైన పండు రేగి పండు. రేగి పండు చూడ్డానికి సూర్యుడిలా గుండ్రంగా, అస్తమించే సమయంలో సూర్యుడు ఉండే రంగులో ఉంటాయి. వీటిని నాణాలతో కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని అంటారు. పిల్లలకి ఉన్న దిష్టి తొలగి వారి శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుందని నమ్ముతారు.

అసలు రహస్యం ఏంటంటే.. బ్రహ్మ రంధ్రం తలపై భాగంలో ఉంటుంది. అయిదేళ్ల వయసు పిల్లలకి ఈ బ్రహ్మ రంధ్రం పలుచగా ఉంటుంది. రేగి పండ్లని తల మీద పోసినప్పుడు.. రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు మెదడులోని నరాలకి తగిలి పిల్లలు యాక్టివ్ అవుతారు. రేగి పండ్లను పోయడం వల్ల బ్రహ్మ రంధ్రం శక్తివంతంగా మారుతుంది. దీని వల్ల పిల్లల మేధస్సు పెరుగుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధుల వల్ల పిల్లలు బలహీనమవుతారు. అందుకే రేగి పండ్లను చలికాలంలో వచ్చే భోగి పండుగ రోజున వారి తల మీద వేస్తారు. రేగి పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే శక్తి పిల్లలకు రావాలని రేగి పండ్లను వేస్తారు. దీని వల్ల పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.

శరీరం చుట్టూ ఉండే నెగిటివ్ ఆరా తొలగిపోతుందని అంటారు. పిల్లల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్, చైతన్యం కలుగుతుందని చెబుతారు. రేగి పండుని బదరీఫలం అని పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం నరనారాయణులు బదరీకావనంలో ఘోర తపస్సు చేసిన సమయంలో దేవతలు వారి శిరస్సుల మీద బదరీ ఫలములను కురిపించారని చెబుతారు. దానికి ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి రేగి పండ్లను భోగి పండ్లుగా వేసే సాంప్రదాయం వచ్చిందని చెబుతారు. దీనికి మరొక కారణం కూడా ఉంది. భోగి తర్వాత సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలి.. మకర రాశిలో అడుగుపెడతాడు. సంక్రాంతి అంటే సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని ఈ రేగి పండ్లను వారి తల మీద పోస్తారు.

సూర్యుడి వలే గుండ్రంగా, ఎర్రటి రంగులో ఉండడం వల్ల దీన్ని అర్కఫలం అని కూడా పిలుస్తారు. ఈ భోగి పండ్లు పోసేటప్పుడు చుట్టుపక్కల పిల్లలు, పెద్దలు అందరూ వస్తారు. పెద్దలు నాణాలతో కలిపి భోగి పండ్లు పోసి.. ఆశీర్వదిస్తారు. నెత్తి మీద నుంచి పడిన భోగి పండ్లను ఏరి.. పశువులకు పెడతారు. రేగి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. రేగి పండ్లు తినడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు, కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు బడి సమీపంలో ప్రతీ దుకాణంలో రేగొడియాలు (రేగి పండ్లతో చేసిన వడియాలు) అమ్మేవారు. రేగి పండ్లను ఎండబెట్టి వాటితో వడియాలు, తాండ్రను చేసేవారు. పిల్లలు వాటిని కొనుక్కుని ఎంతో ఇష్టంగా తినేవారు. 90స్ బ్యాచ్ కి, ఆ ముందు బ్యాచెస్ కి అయితే వీటి గురించి తెలుస్తుంది. ఇప్పటి జనరేషన్ కి తెలుసో లేదో? మరి మీ బాల్యంలో రేగి పళ్ళు, రేగి వడియాలు కొనుక్కుని తిన్నారా? భోగి పళ్ళు తల మీద పోయించుకున్నారా? పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడంపై మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.