శబరిమలలో భారీగా పెరిగిన భక్తుల తాకిడి.. రికార్డు స్థాయిలో రోజుకు లక్ష మంది దర్శనం!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. గత మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో రోజూకు లక్ష మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది. కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతివ్వటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయ్యప్ప మాలధారణ భక్తులు.. స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు. శబరిమల పుణ్యక్షేత్రానికి నిత్యం లక్ష మందికి పైగానే భక్తులు తరలి వస్తున్నారు.

అయ్యప్ప దర్శనానికి దాదాపు 12 గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. శబరిమల ఆలయ ప్రాంగణం భక్తులతో, అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఆదివారం లక్ష మంది రాగా, సోమవారం ఒక్కరోజే 1,19,480 మంది దర్శించుకున్నారు. ఇదే విషయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శబరిమలలో భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగి పోవడంతో.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో భక్తుల రాక, దర్శన ఏర్పాట్లపై సమీక్షించారు. వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం పెంచాలని అధికారులను సీఎం అదేశించారు. అదే విధంగా ఎక్కువ భక్తులు తరలివస్తుండటంతో వారిని నియత్రించడం కష్టతరంగా మారిందని గుర్తించారు.

దీంతో రోజూ గరిష్టంగా 90 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమితంచాలని సమావేశంలో నిర్ణయించారు. అలానే ఆలయ దర్శన సమయాన్ని మరో గంట అదనంగా పెంచాలని నిర్ణయించారు. అయ్యప్ప స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో..దర్శన సమయంలో కూడా మార్పులు చేశారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి మధ్యహ్నం 1.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్వామిని భక్తులు దర్శించుకోవచ్చని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు ఛైర్మన్ కె. అనంతగోపన్ తెలిపారు. ఇది ఇలా ఉండగా.. శబరిమల దేవస్థానంలో నవంబర్ 17న ప్రారంభమైన 41 రోజుల మండల పూజ డిసెంబర్ 27న ముగియనుంది. అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు యాత్ర కోసం డిసెంబర్ 30న తిరిగి తెరుస్తారు.