షుగర్ ఉన్నవాళ్లు నాటుకోడి తినచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

మధుమేహం లేదా షుగర్.. ఏ పేరుతో పిలిచినా కూడా ఇది ఎంతో ప్రమాదమైన జబ్బు అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లి కడుపులో ఉండగానే పిల్లలకు షుగర్ వ్యాధి వస్తోంది. పెరుగుతున్న సాంకేతికత, అందుబాటులోకి వస్తున్న ఔషధాల వల్ల ప్రస్తుతం షుగర వ్యాధి మరీ అంత ప్రమాదం కాదు అనే నిపుణులు చెబుతుంటారు. అయితే రోజూ షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నా కూడా మీ జీవన విధానం కూడా ఎంతో ముఖ్యం. ఇన్సులిన్ తీసుకున్నాను కదా, మందులు వేసుకున్నా కదా అని ఏది పడితే అది తినేస్తే షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది.

అలాగే మాంసాహారం తీసుకునే విషయంలో కూడా చాలా అనుమానాలు ఉంటాయి. చికెన్ తినచ్చా? తింటే ఏది తినాలి? నాటు కోడి మంచిదా? ఫారమ్ కోడి తినచ్చా? అని. అయితే ఒక్క షుగర్ వ్యాధిగ్రస్థులే కాదు.. అందరిలో ఈ ప్రశ్న ఉంటుంది. నాటు కోడి తింటే మంచిదా? బ్రాయిలర్ చికెన్ తింటే మంచిదా? అని. అలాంటి అనుమానాలు ఉన్న వారికోసం ప్రముఖ వైద్యుడు సీఎల్ వెంకట్రావ్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండింటిలో ఏది తింటే మంచిదో చెప్పే ప్రయత్నం చేశారు “నాటు కోడిని తినే సమయానికి దాని వయసు 9 నుంచి 12 నెలలు ఉంటుంది. నాటుకోళ్లు 4 నెలల నుంచే గుడ్లు పెట్టి.. పొదుగుతూ ఉంటాయి.

అలా చేయడం వల్ల వయసు పెరిగి ముసలి కోడి అవ్వడమే కాకుండా శక్తి, పోషక విలువలను కోల్పోతూ ఉంటుంది. అంతేకాకుండా బ్రాయిలర్ గుడ్లు, నాటుకోడి గుడ్లకు పోషక విలువల్లో వ్యత్యాసం ఉండదు. దాదాపుగా రెండు గుడ్లూ ఒకేలా ఉంటాయి. బ్రాయిలర్ కోళ్లు అయితే ఆరు నెలల్లో పెరుగుతాయి. పైగా మంచి ఆహారం, నీళ్లు ఇచ్చి పెంచుతారు. వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు వేస్తారు. నాటుకోడి తినడానికి బాగుంటుంది అంటారు. నాలుకను తృప్తి పరచడం కాదు.. పోషకాల విషయంలో శరీరాన్ని తృప్తి పరచాలి. బ్రాయిలర్ కోడి, బ్రాయిలర్ కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే” అంటూ సీఎల్ వెంకట్రావ్ చెప్పుకొచ్చారు.