స్త్రీలు 5వ రోజు దీపం వెలిగించవచ్చా..

ఈరోజు ధర్మ సందేహంలో చాలామంది అడుగుతున్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. స్త్రీలకి మాసిక ధర్మం వచ్చినప్పుడు ఐదవ రోజుతో శుద్ధి అవుతుందా? ఐదవ రోజుల నుండి వాళ్లు పూజను కొనసాగించవచ్చా? దీపారాధన కావచ్చు హోమం కావచ్చు దానం కావచ్చు ఇవన్నీ వాళ్లు చేసుకోవడానికి ఆ రోజు నుండి అధికారం వస్తుందా? అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి రజో దోషం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అసుచిగా ఉన్నట్లే లెక్క. ఇటువంటి దైవ ,పితృ కార్యాలకు కూడా వాళ్ళు పనికిరారు. నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తని పిల్లలని ముట్టుకోవడానికి భర్తకి సేవ చేసుకోవడానికి వాళ్లకి అధికారం ఏర్పడుతుంది. అంటే నాలుగవ రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత సౌభాగ్యవతి తన భర్తకి సేవ చేసుకోవడానికి కావలసినటువంటి అధికారం పొందుతుంది. ఇక్కడ భర్తకి సేవ అంటే భర్త పిలిచినప్పుడు పలకడం అలాగే ఆయనకి ఏమైనా కావలసి వచ్చినప్పుడు వాటిని సమకూర్చడం ఇలాంటివి.

ఈ నాలుగవ రోజు కూడా వంటావార్పు చేసుకోవడానికి కానీ గుడికి వెళ్లడానికి కానీ లేదా ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికి లేదా తాంబూలం పుచ్చుకోవడానికి వీలు లేదు. నాలుగవ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ లేదా కాటుక పెట్టుకోవడం కానీ గంధం పెట్టుకోవడం కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇలాంటివి ఏవి కూడా పనికిరావు, అలాగే కుంకుమ ధరించడం కూడా నాలుగవ రోజు చేయకూడదు, కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. అలాగే ఐదవ రోజు వచ్చేసరికి పూర్తిగా శుద్ధిరాలు అవుతుంది, ఐదవ రోజు ఎప్పుడైతే తల స్నానం చేస్తారో అప్పటినుండి కూడా ఆవిడ దేవత కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటుంది కనుక నిత్య దీపారాధన చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు పసుపు రాసుకోవచ్చు పూలు పెట్టుకోవచ్చు.

అలాగే తాను తాంబూలం ఇవ్వవచ్చు తీసుకోవచ్చు, అలాగే దేవాలయానికి వెళ్ళవచ్చు యజ్ఞ హోమాలు నిర్వహించవచ్చు, అలాగే పితృ కార్య క్రమాలు కూడా నిర్వహించవచ్చు, వీటన్నిటిలో కూడా 5వ రోజు స్త్రీలకి అధికారం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి అనారోగ్య కారణాల రీత్యా స్త్రీలకు రక్తస్రావం అనేది ఎక్కువ కాలం ఉంటూ ఉంటుంది అటువంటి సందర్భాలలో ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఒకవేళ అధికంగా 10 రోజులు 15 రోజుల పాటు రక్తస్రావం అవుతున్నట్లయితే వారికి అశుచిత్వం లేదు అంటే వారు స్నానం చేసుకుని ఇంట్లోకి రావచ్చు, అలాగే ఇంట్లో ఉన్న వస్తువులను ముట్టుకోవచ్చు అంతే తప్ప దేవతా కార్యక్రమాలలో పాల్గొనకూడదు. ఇవి కాక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు ఉన్నట్లయితే ఒకరు అశుచిగా ఉన్నట్లయితే మిగతా స్త్రీలు దేవాలయాలకు వెళ్లడం కానీ తాంబూలం పుచ్చుకోవడానికి వెళ్లడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఇది కూడా చేయకూడదు, ఒకే ఇంట్లో ఉండేవారు ఎవరైనా అశుచిగా ఉన్నట్లయితే వారితో పాటు ఉండే స్త్రీలు ఎవరు కూడా దేవాలయాలకు వెళ్లడం కానీ తాంబూలాలు తీసుకోవడం కానీ చేయకూడదు.