5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు నిధులు ఇవ్వాలి.. సీఎంకు లేఖ!

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు.. పెట్టుబడి సాయంగా.. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు పేరిట ఆర్థిక సాయం అందచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రైతులకు మాత్రమే.. అది కూడా భూపరిమితి లేకుండా.. ఈ సాయాన్ని అందజేస్తున్నారు. ఏటా రెండు సార్లు.. ఎకరాలకు ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈ పథకంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. వందల ఎకరాల భూమి ఉన్న వారికి కూడా రైతు బంధు నిధులు ఇవ్వడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాక.. ప్రస్తుతం భూస్వాములు.. వ్యవసాయం చేయడం చాలా అరుదు. కౌలుకే ఇస్తున్నారు. వారికి కౌలు డబ్బులతో పాటు.. రైతు బంధు నిధులు కూడా లభిస్తున్నాయి. కౌలు రైతుకు ఎలాంటి ఆర్థిక సాయం లేదు. దీనిపై ఇప్పటికే అనేకమంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుబంధుకు పరిమితి విధించాలని.. కౌలు రైతులకు కూడా సాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అధికారి రైతు బంధు గురించి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా.. కట్టంగూర్‌ మండలంలో వెలుగు చూసింది.

మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తున్న కల్లేపల్లి పరశురాములు.. రైతు బంధు గురించి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులు కేవలం 5 ఎకరాల వరకు భూమి ఉన్న వారికే మాత్రమే ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా ఐదు ఎకరాల వరకు మాత్రమే నిధులు అందజేసి మిగిలిన వాటిని.. పొలాలకు కాలి బాటలను నిర్మించడానికి ఉపయోగించాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. దీనిని మంగళవారం.. పోస్ట్‌ ద్వారా ప్రగతి భవన్‌కు పంపాడు. మరి ఈ అధికారి అన్నట్లు ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు నిధులు ఇవ్వడం సమంజసం అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.