ఆడి కారులో కూరగాయలు అమ్ముతున్న హైటెక్ రైతు…అతను ఎవరో తెలుసా.?

దుక్కి దున్ని, పొలంలో పంట పండించే ఒక రైతు ఎంత కష్టజీవో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికీ భోజనం పెట్టే రైతుకు భోజనం దొరకడం కష్టమైపోతుంటే.. ఒక సాధారణ రైతు ఆడి కార్లో వచ్చి మరి కూరగాయలు అమ్మడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నమ్మశక్యం కాని ఈ సంగతి ఒకవేళ మీకు కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతారు…? రైతే రాజు అనేది కేవలం రాజకీయ నాయకులు మాత్రమే చెప్పే ఒక కొటేషన్…ఎక్కడో వేల ఎకరాలు ఉండి.. అది కూడా వేరే వాళ్ల దగ్గర సాగు చేస్తూ అజమాయిషి చేసే వ్యక్తులైతే కార్లు ,బంగ్లాలు ఉన్నాయని నమ్మవచ్చు.అలా ఉండడం అందరికీ సాధ్యం కాదు కదా… అనుకుంటున్నారా.

మన సమాజంలో నార్మల్ గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేక బిజినెస్ మాన్ అంటే నీట్ గా సూటు బూటు వేసుకొని ఆఫీస్ కి వెళ్తారు అన్న అభిప్రాయం ఉంది.అలాగే రైతు అనగానే ఏదో లుంగీ , దోవతి కట్టుకొని తలపాగా పెట్టుకొని మాసిన బట్టలతో తిరుగుతారు అని అనుకుంటారు. మనం చేసే పనిని బట్టి మన వేషధారణ ఎలా ఉండాలి అనే విషయానికి కొన్ని సోషల్ స్టాండర్డ్స్ ని మనమే ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రస్తుతం కొందరు ఈ స్టాండర్డ్స్ ని ఉల్టా పుల్టా చేస్తున్నారు. మరి ఇంతకీ వాళ్ళు ఎవరో అసలు ఈ సంగతి ఏంటో ఒక లుక్ వేద్దాం పదండి..రైతు అంటే పంచ కట్టుకుని ..సైకిల్ లేక ఎద్దుల బండి మీద ఎందుకు వెళ్లాలా. ఖరీదైన కారులో ఎందుకు వెళ్ళకూడదు…కూరగాయలు ఎందుకు అమ్మకూడదు.. అంటున్నాడు కేరళకు చెందిన సుజిత్ అనే ఒక యువ రైతు.

సరియైన పద్ధతిలో సాగు చేసుకుంటే ఒకరి కింద పని చేయడం కంటే కూడా పదిమందికి అన్నం పెట్టే రైతు అవ్వడమే ఎంతో మేలు అని నిరూపిస్తున్నాడు సుజిత్.ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న లగ్జరీ కార్స్ లో ఒకటైన ఆడి A4 లో మార్కెట్ కు వెళ్లి…తన తోటలో పండించినటువంటి ఎర్ర పాలకూరను నీటుగా అమ్ముకొని వస్తున్నాడు. అతని కేవలం పాలకోరే కాదండోయ్ పలు రకాల కూరగాయలను … రకరకాలుగా పండిస్తున్నాడు. అలాగే తనలాంటి యువతకు ఎందరికో ఆదర్శంగా కూడా నిలుస్తున్నాడు. అతనికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. కష్టపడి పని చేయాలి కానీ చేసే వృత్తికి ఎటువంటి నామోషి ఉండదు అని మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు సుజిత్.