ఈ పండును ఎప్పుడైనా తిన్నారా…. తినకపోతే చాలా నష్టపోతారు

మనలో చాలా మందికి సీతాఫలం గురించి తెలుసు. కానీ రామాఫలం గురించి పెద్దగా చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు రామాఫలం గురించి వివరంగా తెలుసుకుందాం. హృదయాకారంలో, లేత ఎరుగు రంగులోను, ఆకు పచ్చ రంగులో ఉండే రామాఫలం సీతాఫల జాతికి చెందినది. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ పండు చాలా రుచిగా ఉంటుంది.రామాఫలం అనగానే మనకు మన పురాణ పురుషులకు ఇష్టమైన పండు అని అనిపిస్తుంది. కానీ రామాఫలం స్వస్థలం భారతదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలి సారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. మన రాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి ఎక్కువ అనుబంధం. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు ఎక్కువగా పండుతాయి.

అయితే ఈ రోజు సూపర్ మర్కెట్స్ పుణ్యమా అని రామాఫలం అందరికి అందుబాటులోకి వచ్చేసింది. రామాఫలంను నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. సీతాఫలంతో పోలిస్తే రామాఫలంలో గింజలు తక్కువగాను,గుజ్జు ఎక్కువగాను ఉంటుంది. ఒక పండు తింటే అలసిన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందువల్ల పశ్చిమదేశాల్లో క్రీడాకారులు జ్యూస్‌గా చేసి తాగుతుంటారట.రామాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. రామఫలం ఆకులను యాంటీ అల్సర్ ట్రీట్‌మెంట్‌కి వాడుతుంటారు.

మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే లక్షణాలు రామాఫలంలో సమృద్ధిగా ఉన్నాయి. రామాఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది. గుండెకు సంబంధింత సమస్యలను తగ్గిస్తుంది.రామాఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును తగ్గించటంలో సహాయాపడుతుంది. ఈ పండులో విటమిన్ B6 సమృద్ధిగా ఉండుట వలన రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే విటమిన్ B6 కిడ్నీలో రాళ్లను నిరోధిస్తుంది. రామాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండుట వలన హేమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. అలాగే శరీరంలో వివిధ కణాలకు ఆక్సిజన్ రవాణాకు సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి రామాఫలం దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు రామాఫలం తింటే చాలా మంచిది.