ప్రీతి కేసులో షాకింగ్ ట్విస్ట్‌లు! పోలీసులు చెప్పిన అసలు నిజాలు!

పీజీ మెడికల్‌ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సంచలన వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాలు.. జనగామ జిల్లా గిర్నితండాకు చెందిన ధరావత్‌ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇక ఆమె తండ్రి నరేందర్‌ హైదరాబాద్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పీజీ చదువుతూనే ప్రీతి.. వరంగల్ ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో ప్రీతి చదువుతున్న కాలేజీలో పీజీ రెండో ఏడాది చదువుతున్న సైఫ్‌ కొంతకాలంగా ఆమెని ఏడిపిస్తున్నాడు. దీని గురించి బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ప్రీతి తండ్రి నరేందర్.. వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌దాసుతో పోలీసులు మాట్లాడారు. తర్వాత ప్రిన్సిపల్‌ సైఫ్‌ను పిలిపించి మందలించారు.

ర్యాగింగ్‌ భూతం ఎందరు విద్యార్థులను బలి తీసుకుందో.. ఎన్ని జీవితాలను నాశనం చేసిందో లెక్కేలేదు. ర్యాగింగ్‌ నిషేధానికి కఠిన చట్టాలు రాకముందు.. కొన్ని కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విరబోసుకుని నాట్యమాడేది. సీనయర్ల వేధింపులు తాళలేక.. చాలా మంది విద్యార్థులు కాలేజీకి వెళ్లాలంటేనే భయపడేవాడు. మరి కొందరు అయితే ఏకంగా ప్రాణాలు కూడా తీసుకున్నారు. అయితే నేటి కాలంలో ర్యాగింగ్‌ని అరికట్టడానికి కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి.

ఒకప్పటి అంత దారుణాలు ప్రస్తుతం వెలుగు చూడకపోయినా.. నేటి కాలంలో కూడా కొన్ని చోట్ల ర్యాగింగ్‌ ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా వరంగల్ ​ జిల్లా కేఎంసీలో పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మాహత్యాయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సీనియర్‌ విద్యార్థి వేధింపులు తాళలేక ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేశాడు:-

అయితే ప్రీతి తన మీద ఫిర్యాదు చేయడాన్ని సైఫ్‌ తట్టుకోలేకపోయాడు. వాట్సప్ గ్రూపుల్లో అవమానకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించడం ప్రారంభించాడు. ఇతర విద్యార్థులతో కలిసి వాట్సప్ గ్రూపుల్లో ప్రీతిని టార్గెట్ చేసి వేధించడం ప్రారంభించాడు. పైగా తనకు అధికార పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రీతిని బెదిరించాడు. ఇక మరోవైపు ప్రీతి తండ్రి.. తన బిడ్డను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని తెలుస్తోంది. తన తండ్రి స్వయంగా పోలీసు అయినా సరే తనకు పోలీసుల నుంచి సహకారం లభించకపోవడం.. మరోవైపు సైఫ్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో వేధించడం తట్టుకోలేక మనస్థాపానికి గురైన ప్రీతి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

గూగుల్‌లో సర్చ్‌ చేసి మరీ:-

తానే స్వయంగా వైద్య విద్యార్థిని కావడంతో.. పాయిజన్‌ ఇంక్షన్‌ గురించి గూగుల్‌లో సర్చ్‌ చేసి మరీ.. ప్రాణాంతక ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈనెల 22న అనగా బుధవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే.. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన సిబ్బంది.. ఎంజీఎంలోని సీనియర్ డాక్టర్లకు విషయాన్ని తెలియజేశారు. ఈలోపు ప్రీతి గుండె ఆగిపోగా.. సీపీఆర్ చేసి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రీతిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

సైఫ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు:-

ఈ సంఘటనపై ప్రీతి బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు డాక్టర్ సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫోన్‌లో చాటింగ్‌తో పాటు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. సైఫ్‌ వేధిపుంల కారణంగానే ప్రీతి ఆ‍త్మహత్యాయత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. సైఫ్ మొబైల్ లో ప్రీతిని వేధించినట్టు ఆధారాలు కూడా లభించాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రీతికి ఎక్మోపై చికిత్స అందుతోంది. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.