వ్యాక్సిన్ కాదు.. ఫోన్ వల్లే గుండెపోటు: డాక్టర్ చెప్పిన నిజాలు!

దేశంలో ఈమధ్య సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు పెరిగిపోయాయి. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు పెరుగుతోందని అంటున్నారు. అయితే ఇది సరికాదని ప్రముఖ డాక్టర్ చెప్పారు. దేశంలో ఈమధ్య గుండెపోటు కేసులు పెరిగిపోయాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్స్ అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుండెపోటుతో చాలామంది ఉన్నచోటే ప్రాణాలను కోల్పోవడం అందరిలోనూ గుబులు రేపుతోంది. కరోనా వైరస్​కు నివారణగా డెవలప్ చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లే ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్స్ సంభవిస్తున్నాయనే రూమర్స్ ఎక్కువవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ డాక్టర్ కిరణ్ స్పందించారు. గుండెపోటు కేసులు పెరగడం బాధాకరమని.. అయితే ఏ కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈమధ్య కాలంలో తక్కువ వ్యవధిలో బరువు పెరిగినా లేదా తగ్గినా దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలని డాక్టర్ కిరణ్​ సూచించారు. హైపో థైరాయిడిజం లాంటివి ఉన్నా వైద్యులను సంప్రదించాలన్నారు. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు వస్తోందనేది అసంబద్ధమని చెప్పారు.

టీకాలు తీసుకోవడం వల్లే అందరూ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారని తెలిపారు. జరుగుతున్న అన్ని అనర్థాలకు వ్యాక్సిన్​లతో ముడిపెట్టొద్దన్నారు. వ్యాక్సిన్​లతో భయపడొద్దన్నారు. ‘ఇప్పుడు ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. పెద్దలు, పిల్లలనే తేడాల్లేకుండా అందరూ దానికి అడిక్ట్ అయిపోతున్నారు. మొబైల్స్ వాడుతున్నప్పుడు బాడీలో చలనం ఉండదు. కాళ్లు, చేతులు లాంటి అవయవాల కదలిక లేకుంటే రక్తప్రసరణ ఎలా జరుగుతుంది’ అని డాక్టర్ కిరణ్​ చెప్పుకొచ్చారు ‘కూర్చొని ఉంటే రక్తప్రసరణ చేయడం గుండెకు కష్టంగా మారుతుంది. ఫోన్ల వాడకం ఎక్కువవడం కూడా గుండెపోటుకు దారితీస్తోంది.

ఆరోగ్యకరమైన అలవాట్లను అందరూ అలవర్చుకోవాలి’ అని డాక్టర్ కిరణ్​ పేర్కొన్నారు. సరైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. అధికమైన ఒత్తిడి వల్ల గుండెపై తీవ్ర భారం కలుగుతుందని.. కాబట్టి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. గుండెకు భారమయ్యే ఆలోచనలను దూరంగా ఉంచాలన్నారు. మంచి ఆలోచనలు, అలవాట్లను జీవన శైలిలో భాగం చేసుకోవాలన్నారు. ఫోన్ల వాడకం, సోషల్ మీడియా వినియోగం వల్ల వచ్చే అనవసరమైన ఎగ్జయిట్​మెంట్ కూడా గుండెకు భారమేనన్నారు.