కైకాల సత్యనారాయణ మృతిపై ఎమోషనల్ అయిన కూతురు..

కైకాల సత్యనారాయణ  ఈ పేరు ఒక ప్రభంజనం. విలన్ గా, విలక్షణ నటుడిగా, హాస్యనటుడిగా విభిన్నమైన పాత్రలతో తెలుగునాట సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న వెండితెర మహా శిఖరం. అలాంటి శిఖరం ఇవాళ కుప్పకూలిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపి వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కైకాల సత్యనారాయణ కుటుంబానికే కాదు, యావత్ సినీ లోకానికి తీరని లోటు.

ఆయన మృతిపై ఆయన కూతురు రమా సుమన్ టీవీతో మాట్లాడారు. తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నాన్న గారు లేని లోటు తీరనిది అంటూ ఏడ్చేశారు. కుటుంబం మొత్తానికి ఆయన బ్యాక్ బోన్ లా నిలిచారని అన్నారు. మా కుటుంబం మొత్తానికి నాన్న గారే స్ట్రెంత్. మాది చాలా పేద కుటుంబం. మాది, మా నాన్న గారి తరపు బంధువులందరిదీ.. పేద కుటుంబమే. ఆయన కజిన్స్ ఫ్యామిలీని, అందరినీ ఆయనే నిలబెట్టారు. ఇంటికొచ్చిన వారికి లేదు అనకుండా ఇచ్చి పంపిస్తారు.

ప్రతీ ఒక్కరికీ సహాయం చేస్తారు. సహాయం చేయలేని పరిస్థితిలో సాయం చేసే దారి చూపిస్తారు. మా ఊర్లో దేవుడి ఫోటోలు ఉంటాయో, లేదో గానీ ప్రతీ ఒక్కరి ఇంట్లో నాన్న గారి ఫోటోలు ఉంటాయి. అలాంటి ఆయన ఈరోజు లేకపోవడం మాకు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి తీరని లోటు’ అని అన్నారు. యమధర్మరాజు అంటే సత్యనారాయణనే ఊహించుకుంటారని, నవరసాలు అద్భుతంగా పండించగల నటుడు అని అన్నారు. శారద సినిమాలో ఆయన వేసిన అన్నయ్య పాత్ర తనకు బాగా ఇష్టమని అన్నారు.