కోవిడ్‌-19, H3N2 ఇన్‌ఫ్లూయెంజా మధ్య తేడా ఏంటి? లక్షణాలు ఏంటి?

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అకస్మాత్తుగా జ్వరం, దగ్గు జలుబు, తలనొప్పి, వికారం, వాంతులు వంటి వ్యాధులు సోకుతున్నాయి. అయితే చూడ్డానికి ఇది కోవిడ్-19 లానే కనబడుతుంది. చాలా మంది మళ్ళీ కోవిడ్-19వచ్చిందేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా కోవిడ్-19, హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వైరస్ లు రెండూ ఒకటేనా? ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? వీటి లక్షణాలు ఏమిటి? దేశంలో అకస్మాత్తుగా జలుబు, ఫ్లూ కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. నిరంతర దగ్గు, జ్వరం కేసులకు ఇన్ఫ్లూయెంజా హెచ్3ఎన్2 కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్ లు వెల్లడించారు. సాధారణంగా సీజనల్ ఇన్ఫ్లూయెంజా నాలుగు రకాలు. ఏ, బీ, సీ, డీ ఇలా 4 టైప్స్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇన్ఫ్లూయెంజా ఏ మరియు బీ వైరస్ లు వ్యాప్తి చెందుతాయి మరియు సీజనల్ అంటువ్యాధులను కలిగిస్తాయి.

ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా మరియు దేశవ్యాప్తంగా పెరుగుతున్న దగ్గు, జలుబు, వికారం కేసులకు సంబంధించి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ని వినియోగించవద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. చేతులు సబ్బుతో, నీళ్లతో శుభ్రం చేసుకోవాలని వెల్లడించింది. మాస్కులు ధరించాలని, రద్దీ ప్రాంతాల్లో తిరగకూడదని.. తుమ్ము, దగ్గు వచ్చేటప్పుడు నోరు, ముక్కు చేతులతో కవర్ చేసుకోవాలని సూచించింది. కళ్ళను, ముక్కుని టచ్ చేయడం అవాయిడ్ చేయాలని పేర్కొంది. ఎక్కువగా రసాలు తాగాలని.. ఒంటి నొప్పులు, జ్వరం ఉంటే గనుక పారాసెటమాల్ మాత్ర వేసుకోవాలని సూచించింది. దీంతో మళ్ళీ కోవిడ్ 19 వచ్చిందా? లక్షణాలు, తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే కోవిడ్ ఏమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్-19, H3N2 ఇన్‌ఫ్లూయెంజా మధ్య తేడాలు:

కోవిడ్-19, హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా ఈ రెండూ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ద్వానా సోకే వైరస్ లే. ఇవి బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మరియు గణనీయంగా పరివర్తన చెందుతాయి. ఈ రెండు వైరస్ ల వల్ల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్థాయి. కానీ ఈ రెండు వైరస్ లు వేరు వేరు వైరస్ కుటుంబానికి చెందినవి. సార్స్-కోవ్-2 వైరస్ వల్ల కోవిడ్-19 వస్తే, హెచ్3ఎన్2 అనేది మనుషుల్లో వ్యాపించే ఇన్ఫ్లూయెంజా ఉపకారకాల్లో ఒకటి. నివేదికల ప్రకారం, మిగతా వైరస్ లతో పోల్చితే హెచ్3ఎన్2 వల్ల ఎక్కువగా ఆసుపత్రి చేరడానికి దారి తీయవచ్చు. పలు నివేదికల ప్రకారం హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా జ్వరం, గొంతు మంట, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జలుబు వంటి లక్షణాలు కనబడతాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సాధారణంగా సీజనల్ ఇన్ఫ్లూయెంజా వల్ల హఠాత్తుగా జ్వరం, దగ్గు (ఎక్కువగా పొడి దగ్గు), తలనొప్పి, కండరాలు మరియు కీళ్ళ నొప్పి, తీవ్రమైన అనారోగ్యం, గొంతు మంట, జలుబు వంటి వ్యాధులు వస్తాయి. 

ఇప్పటివరకూ వచ్చిన చాలా ఇన్ఫ్లూయెంజా కేసులు శ్వాస కోశ లక్షణాలను నివేదిస్తున్నాయి. నిరంతర దగ్గు, తలనొప్పి, జ్వరం, గొంతు మంట, జలుబు, వాంతులు, విరేచనాలు వంటివి కూడా ఇన్ఫ్లూయెంజా లక్షణాలుగా వైద్యులు గుర్తించారు. దగ్గు వెంటనే తగ్గదు. సీజనల్ జ్వరం 5 నుంచి 7 రోజులు ఉంటుంది. కొన్ని కేసుల్లో దగ్గు 3 వారాల పాటు ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ సోకిన టైంకి, లక్షణాలు మొదలయ్యే టైం మధ్య ఉన్న పీరియడ్. ఒక మనిషి నుంచి మరొక మనిషికి సార్స్-కోవ్ -2 వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అనారోగ్యానికి దారి తీయడానికి 2 నుంచి 14 రోజులు పడుతుంది. అంటే కోవిడ్-19 లక్షణాలు కనబడడానికి 2 నుంచి 14 రోజులు సమయం పడుతుంది.

అదే సీజనల్ ఇన్ఫ్లూయెంజా విషయానికొస్తే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుంచి అనారోగ్యానికి అంటే ఈ వైరస్ లక్షణాలు కనబడడానికి 1 నుంచి 4 రోజులు పడుతుంది. అయితే కోవిడ్-19 వచ్చిందా? లేక ఫ్లూ వచ్చిందా? అనేది స్వతహాగా నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేసుకోవచ్చు. ఫలితాలు ఇవ్వడంలో ఇది చాలా వేగంగా పని చేస్తుంది. లేదా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా యాక్యురేట్ గా పని చేస్తుంది. కానీ ఫలితాల కోసం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫ్లూ మరియు కోవిడ్ పరీక్షల కోసం శ్వాసకోశ శాంపిల్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నాజల్ స్వాబ్ టెస్ట్ చేయాలి. కోవిడ్-19, ఇన్ఫ్లూయెంజా లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉన్నా గానీ రెండు వైరస్ లు ఒకటి కాదని వైద్యులు వెల్లడించారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.