ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత ఎదుర్కొన్న ప్రశ్నలివే..!

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశరాజధానిలో చోటు చేసుకున్న ఈ స్కామ్‌ మూలాలు తెలంగాణలో వెలుగు చూడటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు తెర మీదకు రావడం..

సీబీఐ ఆమెకు నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు 6-7 గంటల పాటు సీబీఐ అధికారులు.. కవితను సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణలో కవితకు ఎదురయిన ప్రశ్నలు ఏంటి.. వాటికి ఆమె ఏం జవాబు చెప్పారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు..

ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. ఆదివారం ఉదయం 10.50 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-14లోని కవిత గృహానికి చేరుకుంది. కవిత ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6.30 వరకు.. సుమారు ఏడున్నర గంటలపాటు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. 

కవితకు సీఆర్పీసీ 160 కింద జారీ చేసిన నోటీసు మేరకు.. ఈ స్కామ్‌లో కేవలం ఆమెను ఓ సాక్షిగానే విచారిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అధికారులు కవిత న్యాయవాది సమక్షంలో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అధికారులు సుమారు 40-50 ప్రశ్నలు సంధించగా.. కవిత కేవలం నాలుగైదింటికే సమాధానం చెప్పినట్లు సమాచారం.

ఎక్కువ శాతం ప్రశ్నలకు ఆమె ‘తెలియదు’ అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన అమిత్‌ అరోరా మీకు ఎలా తెలుసు.. అతడితో మాట్లాడారా.. ఈ కేసులో మీ పేరు ఎందుకు వచ్చింది.. అని కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అలానే ఈ కేసులో కవిత 10కి పైగా ఫోన్లను వాడినట్లు తెలియడంతో.. అన్ని ఫోన్లను ఎందుకు వాడారు.. తర్వాత వాటిని ఎందుకు ధ్వంసం చేశారు అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాక.. అధికారులు కవిత సెల్‌ఫోన్‌ కాల్‌డేటా రికార్డులను ముందు పెట్టి.. ఏయే రోజు.. ఏయే సమయంలో ఎవరెవరితో మాట్లాడారనే ఆధారాలను చూపిస్తూ..

వాటి ఆధారంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కవిత.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా, అమిత్‌ అరోరా, విజయ్‌నాయర్‌తో ఫోన్‌లో మాట్లాడారని పేర్కొంటూ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ జరిగిన సమయంలోనే.. ఈ ఫోన్‌కాల్స్‌ వెళ్లాయని అధికారులు గుర్తుచేసినట్లు సమాచారం. ఆ తర్వాత శరత్‌ చంద్రారెడ్డి, సౌత్‌గ్రూప్‌ ఏర్పాటు..

దానిలో కవిత పాత్ర వంటి కోణాల్లో అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలానే అమిత్‌ అరోరాకు రూ. 100 కోట్ల మేర ముడుపులు అందడం.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణాలు, ముఖ్యంగా చార్టర్డ్‌ విమానాలపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అధికారులు సీఆర్పీసీ 91 కింద కవితకు మరో నోటీసు జారీ చేశారు అని తెలుస్తుంది .