రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..ఇలా చేస్తే ఈజీగా రూ.3లక్షల లోన్..

భారతదేశంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతులకు రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా పోర్టల్ ప్రారంభించింది. పీఎం కిసాన్ రుణ్ పోర్టల్ (PM Kisan Rin Portal) లాంఛ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పీఎం కిసాన్ రుణ్ పోర్టల్‌ను అధికారికంగా లాంఛ్ చేశారు. రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో లేదు. అయితే, తాజాగా తీసుకొచ్చిన పీఎం కిసాన్ రిన్ పోర్టల్‌లో రైతుల పూర్తి డేటా, రుణాల మంజూరు, వడ్డీ రాయితీ క్లెయిమ్ చేసుకోవడం లాంటివన్నీ ఉంటాయి.

బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ వెబ్‌సైట్ ద్వారా లోన్స్ పొందవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పీఎం కిసాన్ రిన్ పోర్టల్‌లో 97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ రూరల్ బ్యాంకులు, 512 కోఆపరేటీవ్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. https://fasalrin.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.ఇక ఈ ఏడాది మార్చి 30 నాటికి దేశ వ్యాప్తంగా 7.35 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారు.

ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మధ్య కేంద్ర ప్రభుత్వం రూ.6,573.50 కోట్ల రుణాలను సబ్సిడీ వడ్డీ రేటుకే మంజూరు చేసిందని కేంద్ర మంత్రులు తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు తీసుకోని వారికి, ఈ పథకం గురించి తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఘర్ ఘర్ కేసీసీ అభియాన్ పేరుతో డోర్ టు డోర్ క్యాంపైన్ నిర్వహించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా సబ్సిడీ వడ్డీ రేటుకు రూ.3 లక్షల రుణాలు పొందవచ్చు.రైతులు ఎవరికైనా రుణాలు అవసరమో వారు https://fasalrin.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.