ప్రీతి ఆత్మహత్య కేసు: సైఫ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు!

ప్రీతి కేసుకు సంబంధించిన పోలీసులు రిమాండ్‌ రిపోర్టును సిద్ధం చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రతీ, సైఫ్‌లకు మధ్య గొడవలు జరగటానికి కారణాలను పోలీసులు స్పష్టంగా పొందుపరిచారు. వరంగల్‌ కేఎంసీ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా, ప్రీతి కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టును సిద్ధం చేశారు. ఈ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను చేర్చినట్లు సమాచారం.

ప్రీతికి ఆమె సీనియర్‌ సైఫ్‌కు మధ్య ఎందుకు గొడవ మొదలైందన్న దాన్ని కూడా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రిమాండ్‌ రిపోర్టు ప్రకారం.. ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు ఆమె వాట్సాప్‌ చాట్స్‌ డిలీట్‌ కాలేదు. పోలీసులు మొత్తం 17 వాట్సాప్‌ చాట్స్‌ను కనుగొన్నారు. ఆమె అనూష, భార్గవి అనే యువతులతో తరచుగా చాటింగ్‌ చేసింది. ఎల్‌డీడీ ప్లస్‌ నాక్‌ అవుట్స్‌ అనే గ్రూపులో కూడా చాటింగ్‌ చేసింది. ఓ రెండు అంశాల విషయంలో సైఫ్‌, ప్రీతి మధ్య గొడవ మొదలైంది. ఓ యాక్సిడెంట్‌ కేసును డీల్‌ చేయాలంటూ సైఫ్‌ ప్రీతికి సూచించాడు.

అందులో ప్రైమరీ అనస్థీషియా రిపోర్టు రాయటం అమె మర్చిపోయింది. ఈ రిపోర్టును వాట్సాప్‌ గ్రూపులో పెట్టిన సైఫ్‌.. ప్రీతిపై కామెంట్లు చేశాడు. పేమెంట్‌ సీట్‌.. రిజర్వేషన్‌ సీట్‌ అంటూ హేళనగా మాట్లాడాడు. ప్రీతి అదే వాట్సాప్‌ గ్రూపులో సైఫ్‌కు కౌంటర్‌ ఇచ్చింది. నాతో నీకేమైనా ప్రాబ్లమ్‌ ఉందా? అని ప్రశ్నించింది. అప్పటినుంచి ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ప్రీతికి ఎలాంటి విరామం లేకుండా డ్యూటీలు వేయాలని సైఫ్‌ కొంతమంది వ్యక్తులకు చెప్పాడు. భార్గవ్‌ అనే వ్యక్తిని ఇందుకోసం పురమాయించాడు. దీనిపై ప్రీతి హెచ్‌ఓడీకి కంప్లైంట్‌ చేసింది.

తర్వాత ఓ ముగ్గురు డాక్టర్ల బృందం సైఫ్‌, ప్రీతిలకు కౌన్సిలింగ్‌ ఇచ్చింది. అయినప్పటికి ఇద్దరి మధ్యా గొడవలు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే సైఫ్‌ వేధింపులు తట్టుకోలేకపోయిన ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. కాగా, ప్రీతి తాను చనిపోవటానికి ఓ ప్రమాదకరమైన మత్తు ఇంజెక్షన్‌ వాడింది. దాని వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి కన్నుమూసింది. మరి, పర్సనల్‌ ఈగోల కారణంగా గొడవలు పడుతున్న నేటి యువతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.